వీవీఐపీ భద్రతకు మహిళా కమెండోలు | Sakshi
Sakshi News home page

వీవీఐపీ భద్రతకు మహిళా కమెండోలు

Published Thu, Dec 23 2021 5:20 AM

CRPF women commandos to protect top politicians - Sakshi

న్యూఢిల్లీ: సుశిక్షితులైన కేంద్ర రిజర్వ్‌ పోలీస్‌ దళం(సీఆర్‌పీఎఫ్‌)కు చెందిన తొలి మహిళా కమెండోల బృందం దేశంలోని వీవీఐపీలకు త్వరలో భద్రత కల్పించనుంది. హోం మంత్రి అమిత్‌ షా, కాంగ్రెస్‌ నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ దంపతులు సహా పలువురు వీవీఐపీల భద్రతా బాధ్యతల్లో సీఆర్‌పీఎఫ్‌ మహిళా కమెండోలు పాలుపంచుకోనున్నారు. వీవీఐపీలు ఇంట్లో ఉన్నపుడు రక్షణ, నిఘా బాధ్యతలు చూస్తారు. త్వరలో 5 రాష్ట్రాల ఎన్నికల్లో అగ్రనేతలు పర్యటించినపుడు మహిళా కమెండోలు వీరి వెన్నంటే ఉండి బాధ్యతలు నిర్వర్తిస్తారు.

మొత్తంగా 32 మందితో సిద్ధమైన   కమెండోల దళాన్ని రంగంలోకి దింపనున్నారు. ఆయుధాలు లేకుండానే శత్రువుతో పోరాడటం, అన్ని రకాల ఆయుధాలను వాడే నైపుణ్యం, డేగ కళ్లతో చుట్టూరా చూస్తూ వీవీఐపీలకు పొంచి ఉన్న ముప్పును పసికట్టడం, భద్రత కల్పించడం తదతర అంశాల్లో వీరంతా 10 వారాల కఠోర శిక్షణను పూర్తిచేశారు. వచ్చే ఏడాది జనవరిలో వీరిని విధుల్లోకి తీసుకుంటారని సంబంధిత వర్గాలు బుధవారం వెల్లడించాయి. ముందుగా ఢిల్లీలో జెడ్‌+ కేటగిరీలో ఉన్న అమిత్,  మన్మోహన్‌ దంపతులు తదితరుల రక్షణ బాధ్యతలను వీరికి అప్పగిస్తారు. రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లినపుడు వీవీఐపీలు బస చేసిన ఇంట్లో తనిఖీ బాధ్యతలు వీరివే.

Advertisement
Advertisement