‘స్నేక్‌ వైన్‌’ అంటే ఏమిటి? దీనిని ఎలా తయారు చేస్తారో తెలిస్తే...

27 May, 2023 13:29 IST|Sakshi

మీరెప్పుడైనా పాములతో తయారయ్యే మద్యం గురించి విన్నారా? ఈ మాట వినగానే హడలెత్తిపోతున్నారా? ఈ తరహా మద్యం తయారు చేసేందుకు ముందుగా వరి ధాన్యంతో పాటు ఇతర దినుసులతో మద్యం తయారు చేసి, దానిలో బతికున్న లేదా చచ్చిన పామును ఉంచి, కొంత కాలం దానిని నిల్వ చేస్తారు. ఈ రకంగా తయారు చేసిన మద్యాన్ని పలు చికిత్సలలో కూడా వినియోగిస్తారు. స్నేక్‌ వైన్‌ను చైనాలో తయారు చేస్తుంటారు. దీనిని ‘పినియన్‌’, ‘వియత్నామీ’ భాషలో ‘ఖమెర్‌’ అని అంటారు. దీనిని తొలిసారి పశ్చిమ జోవు వంశానికి చెందినవారు తయారు చేశారని చెబుతారు.

అనంతరం కాలంలో ఈ మద్యానికి చైనా అంతటా ఆదరణ దక్కిందని అంటారు. చైనాతోపాటు ఈ మద్యాన్ని దక్షిణాసియా, ఉత్తర కొరియా, లావోస్‌, థాయ్‌లాండ్‌, వియత్నాం, జపాన్‌, కంబోడియాలలోనూ తయారు చేస్తుంటారు. ఈ మద్యాన్ని కుష్టు వ్యాధి, అత్యధికంగా చెమట కారడం, జట్టు ఊడిపోవడం, చర్మం పొడిబారడం తదితర సమస్యల పరిష్కారానికి వినియోగిస్తుంటారు. దీనిని టానిక్‌ మాదిరిగా భావిస్తుంటారు. పలు దేశాలలో ఈ తరహా మద్యాన్ని ఔషధ దుకాణాలలో విక్రయిస్తుంటారు. వియత్నాంలో పామును వేడికి, మగతనానికి ప్రతీకగా భావిస్తారు.

అందుకే ఇక్కడ ఈ తరహా మద్యానికి ఎంతో ఆదరణ లభిస్తుంటుంది. దీనిని ఇక్కడి ప్రజలు లైంగికశక్తిని పెంచే ఔషధంగా పేర్కొంటారు. కాగా ఈ మద్యంపై నిర్వహించిన కొన్ని అధ్యయనాల ప్రకారం స్నేక్‌వైన్‌లో శారీరక నొప్పులను తగ్గించే, వాపును నివారించే గుణాలు ఉన్నాయని తేలింది. అయితే దీనిని తాగడం ఎంతవరకూ సురక్షితమనే దానిపై నిపుణులు సమాధానమిస్తూ వరిధాన్యంతో చేసే మద్యంలో ఇథనాల్‌ వినియోగిస్తారని, దీని వలన పాములోని విషం తొలగిపోతుందని తెలిపారు. కాగా ఈ తరహా మద్యం తయారీలో అత్యధిక విషం కలిగిన పాములను వినియోగించరు. అయితే ఈ మద్యం బాటిళ్లపై ఇది ప్రమాదకరం అని కూడా రాసివుంటుంది. 

మరిన్ని వార్తలు