When Did Humans Almost Go Extinct: ప్రపంచ జనాభాలో 1,280 మంది మాత్రమే మిగిలిన విపత్తు ఏది?

21 Sep, 2023 09:27 IST|Sakshi

మానవులు భూమిపై అనేక విపత్తులను చవిచూశారు. ప్రతి సంవత్సరం లెక్కలేనంత జనాభా.. భూకంపాలు, వరదలకు బలవుతూవస్తోంది. ఇటీవలి కరోనా విధ్వంసం లక్షలాదిమంది ప్రాణాలను బలిగొంది. అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్న విధ్వంసం గురించి విన్నప్పుడు ఎవరికైనా సరే కాళ్ల కింద భూమి కంపించినట్లవుతుంది. నాటి ఆ విపత్తు తీవ్రతకు ఈ భూమండలంపై కేవలం 1,280 మంది మాత్రమే మిగిలారు. 

ఈ పెను విపత్తు ఎప్పుడు సంభవించింది?
మనం చెప్పుకోబోతున్న ఈ సంఘటన తొమ్మిది లక్షల సంవత్సరాల క్రితం జరిగింది. అంతటి విపత్తులో తమను తాము రక్షించుకోగలిగిన 1,280 మంది మాత్రమే మిగిలారు. వారి కారణంగానే ఈ రోజు ఈ భూమిపై ఎనిమిది బిలియన్ల మంది ప్రజలు జీవించి ఉన్నారని చెబుతారు.

శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం
జర్మన్ న్యూస్ వెబ్‌సైట్ డీడబ్ల్యు తెలిపిన వివరాల ప్రకారం మనిషి పూర్వీకులు ఒకప్పుడు విపత్తులకు చాలా దగ్గరగా ఉండేవారు. ఈ విషయాన్ని జన్యు విశ్లేషణ ఆధారంగా జరిపిన ఒక అధ్యయనం వెల్లడించింది. మానవ జనాభా దాదాపు అంతరించిపోయిన కాలం ఒకప్పుడు ఏర్పడిందని ఈ అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పరిశోధన రెండు లక్షల సంవత్సరాల క్రితం దొరికిన ఆదిమ మానవుల అవశేషాలపై జరిగింది.

ఈ పరిశోధన ఎవరు సాగించారంటే..
చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన షాంఘై ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఈ పరిశోధన చేసింది. తొమ్మిది లక్షల ముప్పై వేల సంవత్సరాల క్రితం భూమిపై తలెత్తిన ఆ విపత్తు అనంతరం భూమిపై కేవలం 1280 మంది మాత్రమే మిగిలారని పరిశోధకులు కంప్యూటర్ మోడలింగ్ ద్వారా కనుగొన్నారు. నాటి భీకర విపత్తులో 98.7 శాతం మానవ జనాభా నాశనమైందని ఈ పరిశోధన నిర్వహించిన ప్రధాన పరిశోధకుడు హైపెంగ్ లీ వివరించారు.

ఇంతకీ నాడు భూమిపై ఏమి జరిగింది?
ఈ పరిశోధనలో వెల్లడైన వివరాల ప్రకారం మంచు యుగంలో భూమిపై ఉష్ణోగ్రతలు విపరీతంగా తగ్గడం వల్ల ఈ విపత్కర పరిస్థితి ఏర్పడింది. ఈ మంచు యుగంలో మానవులు దాదాపు అంతరించిపోయారు. అయితే అంతటి దుర్భర పరిస్థితిలోనూ తమను తాము రక్షించుకోవడంలో కొందరు మానవులు విజయం సాధించారు. ఈ మానవులే తదుపరి మానవ నాగరికత అభివృద్ధికి కారణమయ్యారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
ఇది కూడా చదవండి: తల తీయడం మొదలు తుపాకీతో కాల్చడం వరకూ.. ఏ దేశంలో ఎటువంటి మరణశిక్ష?

మరిన్ని వార్తలు