కొత్త మహమ్మారుల జాబితా తయారీకి... రంగంలోకి డబ్ల్యూహెచ్‌ఓ

23 Nov, 2022 03:04 IST|Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా సమీప భవిష్యత్తులో కరోనా తరహా మహమ్మారులకు కారణం కాగల వైరస్‌లను గుర్తించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) రంగంలోకి దిగింది. మనకింకా ఆనుపానులు తెలియని డిసీజ్‌ ఎక్స్‌ ఈ జాబితాలో ముందు వరుసలో ఉంది. ప్రస్తుత జాబితాలో దానితో పాటు కొవిడ్‌–19, ఎబోలా, మార్బర్గ్, లాసా ఫీవర్, మిడిలీస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ (ఎంఈఆర్‌ఎస్‌), నిఫా, సార్స్, రిఫ్ట్‌ వ్యాలీ ఫీవర్, జికా వైరస్‌ తదితరాలున్నాయి. పరిశోధనలో తెరపైకి వచ్చే కొత్త వైరస్‌లతో జాబితాను సవరించనున్నారు.

‘‘ఇందుకోసం పలు బ్యాక్టీరియా కారకాలపై నిశితంగా దృష్టి పెట్టాం. వీటిలో డిసీజ్‌ ఎక్స్‌ అత్యంత ప్రమాదకరమైన అంతర్జాతీయ అంటువ్యాధిగా మారే ఆస్కారముంది’’ అని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది. 300 మందికి పైగా శాస్త్రవేత్తలు ఈ అధ్యయనంలో తలమునకలుగా ఉన్నారు. 25కు పైగా వైరస్, బ్యాక్టీరియా కుటుంబాలపై పరిశోధనలు చేయనున్నారు. ఇలాంటి జాబితాను తొలిసారిగా 2017లో డబ్ల్యూహెచ్‌ఓ విడుదల చేసింది. దాన్ని 2018లో సవరించారు. భావి మహమ్మారిని ముందుగానే గుర్తించి దీటుగా ఎదుర్కొనేందుకు రాబోయే జాబితా కరదీపిక కాగలదని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ సౌమ్యా స్వామినాథన్‌ అన్నారు. ఈ జాబితాను 2023 మార్చిలోగా విడుదల చేయొచ్చని భావిస్తున్నారు. 

ఇదీ చదవండి: China Sheep Walking Video: చైనాలో గొర్రెల వింత ప్రవర్తన.. ఎట్టకేలకు వీడిన మిస్టరీ!

మరిన్ని వార్తలు