పుతిన్ ఎవర్ని చూసుకుని కయ్యానికి కాలు దువ్వుతున్నారు? వెనుక ఉన్నదెవరు?

6 Mar, 2022 09:23 IST|Sakshi

Strategies On The Battlefield: ఉక్రెయిన్‌పై దండయాత్రతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఏకాకిగా నిలిచారు పది రోజులైనా నిర్విరామంగా దాడులు చేస్తూ  ప్రపంచ ప్రజల దృష్టిలో విలన్‌గా ముద్ర పడ్డారు. దురహంకారపూరిత నిర్ణయాలతో యుద్ధాన్ని నడిపిస్తూ అందరికీ ఆయనే కనిపిస్తున్నారు. మరి పుతిన్‌ వెనుక ఉన్నదెవరు ? కథనానికి కాలు దువ్వడంలోనూ, యుద్ధ రంగంలో వ్యూహాలు రచించడంలో పుతిన్‌ వెంట నడుస్తున్నదెవరు అన్నది ఆసక్తికరంగా మారింది. ఉక్రెయిన్‌పై దాడిలో పుతిన్‌కు వీరందరూ అన్నీ తామై వ్యవహరిస్తున్నారు.  

సెర్గీ షొయిగు 
రక్షణ మంత్రి, వయసు 66  
పశ్చిమ దేశాల మిలటరీ ముప్పు నుంచి రష్యాను కాపాడాలని, నాటోలో చేరాలని ఉబలాటపడుతున్న ఉక్రెయిన్‌ను నిస్సైనికీకరణ చేయాలన్న రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌కు మొదట్నుంచి వంత పాడుతున్నది ఆ దేశ రక్షణ మంత్రి సెర్గీ షొయిగు. పుతిన్‌కు మంచి మిత్రుడు. ఒకానొక సందర్భంలో సైబేరియాలో పుతిన్‌తో కలిసిమెలిసి సరదాగా చేపలు పడుతూ కూడా కెమెరాలకు చిక్కారు. పుతిన్‌ వారసుడు సెర్గీ అన్న ప్రచారం కూడా ఉంది. ఎలాంటి క్లిష్టమైన ఆపరేషన్లలో అయినా పుతిన్‌కు తోడుగా ఉంటారు. 2014లో క్రిమియాను స్వాధీనం చేసుకున్న క్రెడిట్‌ ఆయనకే దక్కింది. ఇప్పుడు ఉక్రెయిన్‌ యుద్ధం వ్యూహరచనలో కూడా ఆయనదే ప్రధాన పాత్ర.  

వలేరి జెరసిమోవ్‌  
రష్యా సాయుధ బలగాల చీఫ్‌ ఆఫ్‌ జనరల్‌ స్టాఫ్‌ వయసు 66  
రష్యా సాయుధ బలగాల చీఫ్‌గా వలేరి జెరసిమోవ్‌ యుద్ధాన్ని ముందుండి నడిపిస్తున్నారు. 1999లో చెచెన్‌ యుద్ధ సమయం నుంచి మిలటరీ ప్రణాళికల్లో అందెవేసిన చెయ్యి. పుతిన్‌కి అత్యంత విధేయుడిగా ఉంటారు. ఉక్రెయిన్‌ యుద్ధ ప్రణాళిక ఆయన కనుసన్నుల్లోనే సాగుతోంది. గత నెలలో బెలారస్‌ మిలటరీ డ్రిల్స్‌ కూడా ఆయన పర్యవేక్షణలోనే సాగాయి. యుద్ధం మొదలయ్యాక ఉక్రెయిన్‌ నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురు కావడంతో, రష్యా సైనికులు నైతిక స్థైర్యాన్ని కోల్పోయారు. దీంతో వలేరి పనితీరుపై పుతిన్‌ అసంతృప్తితో ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది.  
 

నికోలాయ్‌ పత్రుషెవ్‌ 
రష్యా భద్రతా మండలి కార్యదర్శి  వయసు 70  
పుతిన్‌కు అంతరంగికుల్లో నికోలాయ్‌ ఒకరు. 1970ల నుంచి వీరిద్దరి మధ్య గట్టి అనుబంధం ఉంది. పుతిన్‌ సలహాదారుల్లో దుందుడుకు చర్యలు తీసుకునే వారిగా పేరు పొందారు. సోవియెట్‌ యూనియన్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ కేజీబీలో పుతిన్‌తో కలిసి సన్నిహితంగా పని చేశారు. ఇప్పటి రష్యన్‌ ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ (ఎఫ్‌ఎస్‌బీ) చీఫ్‌గా 1999–2008 వరకు సేవలు అందించారు.ఒకప్పటి లెనిన్‌గ్రాడ్‌ (నేటి సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌) మిత్రత్రయంలో మొదటి వారు. అంతర్జాతీయ వ్యవహారాలను సునిశిత దృష్టితో చూస్తారు. రష్యాని లొంగదీసుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తోందని నమ్ముతూ వస్తున్నారు. ఉక్రెయిన్‌పై దాడి చేయాలని పుతిన్‌ నిర్ణయించుకోవడానికి ముందు సమావేశమైన అంతరంగికుల్లో నికోలాయ్‌ ఒకరు. ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత ఎదురవుతున్నా ఉక్రెయిన్‌పై దాడికి ఆజ్యం పోయడంలో ఆయన పాత్ర ఎక్కువగా ఉంది.  

అలెగ్జాండర్‌ బోర్టనికోవ్‌
ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ డైరెక్టర్‌  వయసు 70 
సోవియెట్‌ యూనియన్‌ విచ్ఛిన్నం కాకముం దు నుంచి పుతిన్‌ వెంటే అలెగ్జాండర్‌  ఉన్నారు. నికోలాయ్‌ పత్రుషెవ్‌ తర్వాత ఎఫ్‌ఎస్‌బీ డైరెక్టర్‌ పగ్గాలు చేపట్టారు. పుతిన్‌ మద్దతుతో చట్టాలను అమలు చేయడంలో ఎఫ్‌ఎస్‌బీని అత్యంత శక్తిమంతంగా తీర్చిదిద్దారు. నికోలాయ్, అలెగ్జాండర్‌ల మధ్య గాఢమైన స్నేహం ఉంది. పుతిన్‌కు రెండు కళ్లుగా ఉన్నారు. భద్రతా సర్వీసుల మాటంటేనే పుతిన్‌కు      ఎప్పుడూ వేదవాక్కు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి    దిగాలన్న నిర్ణయం అలెగ్జాండర్‌దేనని, ఆయన మాట మీదే పుతిన్‌ ఈ దుస్సాహసానికి దిగారన్న ప్రచారం ఉంది 
 

సెర్గీ నారిష్కిన్‌ 
ఫారెన్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ (ఎస్‌వీఆర్‌) డైరెక్టర్‌  వయసు 67 
సోవియెట్‌ యూనియన్‌ గూఢచర్య విభాగం కేజీబీ నుంచి  పుతిన్‌తో ఉన్న వారిలో నారిష్కిన్‌ మరో ముఖ్యుడు. ఇప్పటివరకు ఎక్కువ కాలం పుతిన్‌ వెంట ఉన్న ఘనత ఈయనకే దక్కుతుంది.  నికోలాయ్, అలెగ్జాండర్, సెర్గీ నారిష్కిన్‌లకు లెనిన్‌గ్రాడ్‌ ట్రయో అన్న పేరు ఉంది. ఎప్పుడూ పుతిన్‌కు నీడలా ఉంటారు. పుతిన్‌ విమర్శకులపై రష్యా వెలుపల విష ప్రయోగం చేయించి ప్రాణాలు తీస్తారన్న ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. అయితే ఉక్రెయిన్‌తో యుద్ధానికి దిగడానికి ముందు జరిగిన సమావేశంలో పశ్చిమ దేశాలకు లాస్ట్‌ చాన్స్‌ ఇవ్వాలని పుతిన్‌కు సలహా ఇచ్చారు. ఆ తర్వాతే పుతిన్‌ ఉక్రెయిన్‌లోని తిరుగుబాటు దారుల అధీనంలో ఉన్న రెండు ప్రాంతాలకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తూ అధ్యక్షుడి హోదాలో ఉత్తర్వులు జారీ చేశారు.  

సెర్గీ లావరోవ్‌  
విదేశాంగ మంత్రి, వయసు 71 
పుతిన్‌ కేబినెట్‌లో సీనియర్‌ నాయకుడు. 2004 నుంచి విదేశాంగ మంత్రిగా ఉంటూ అంతర్జాతీయ వేదికలపై పుతిన్‌ గళం వినిపిస్తూ ఉంటారు.పుతిన్‌కు అత్యంత విశ్వసనీయ వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. ఉక్రెయిన్‌ సమస్యని దౌత్యపరంగా పరిష్కరించుకోవాలని ఆయన పలుమార్లు చెప్పినప్పటికీ పుతిన్‌ ఖాతరు చేయలేదని అంటారు.  ఉక్రెయిన్‌పై దాడిలో ప్రత్యక్షంగా ఎలాంటి పాత్ర లేకపోయినప్పటికీ  యుద్ధాన్ని సమర్థించుకుంటూ మాట్లాడాల్సిన బాధ్యత లావ్‌రావ్‌పైనే ఉంది. అందుకే తన వాదనను బలంగా వినిపిస్తారు. యూఎన్‌ భద్రతా మండలి సమావేశంలో ఆయన ప్రసంగాన్ని ఇతర దేశాల ప్రతినిధులు బహిష్కరించినప్పటికీ పట్టించుకోకుండా తాను చెప్పదలచుకున్నది చెప్పారు.   
– నేషనల్‌ డెస్క్, సాక్షి

మరిన్ని వార్తలు