రోడ్డు వేయండి సారూ..

20 Sep, 2023 01:48 IST|Sakshi
మంకమ్మతోట జ్యోతినగర్‌ లింక్‌ రోడ్డు దుస్థితి

రెండు దశాబ్దాలుగా కలగని మోక్షం

అధ్వానంగా మంకమ్మతోట– జ్యోతినగర్‌ లింక్‌రోడ్డు

కరీంనగర్‌ కార్పొరేషన్‌: రెండు దశాబ్దాల క్రితం వేసిన రోడ్డే దిక్కయింది. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ కోసం రోడ్డును తవ్విన ఆనవాళ్లు నగరమంతటా చెరిగిపోతున్నా ఇక్కడ మాత్రం అలాగే భద్రంగా ఉన్నాయి. మాకు రోడ్డెయండి మహాప్రభో అంటూ అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ కాలనీవాసులు ఏళ్లుగా తిరిగినా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. నగరంలోని ప్రధాన లింక్‌ రోడ్డుల్లో ఒకటైన మంకమ్మతోట జ్యోతినగర్‌ రోడ్డు దుస్థితి ఇది.

రెండున్నర కిలోమీటర్లు..

జ్యోతినగర్‌ మోర్‌ సూపర్‌ మార్కెట్‌ నుంచి కాశ్మీర్‌గడ్డ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వెనుక వైపు వరకు దాదాపు రెండున్నర కిలోమీటర్లు ఈ రోడ్డు ఉంటుంది. 55వ డివిజన్‌ పరిధిలోని మంకమ్మతోటలోని శ్రీరాంబుక్‌స్టాల్‌ నుంచి జ్యోతినగర్‌ చౌర స్తా వరకు ఉన్న లింక్‌రోడ్డు శిథిలావస్థకు చేరి సంవత్సరాలు గడుస్తున్నా అభివృద్ధికి నోచుకోవడం లే దు. ఇరవైఏళ్లకు ముందు అప్పటి ప్రభుత్వం వేసిన సీసీ రోడ్డు తరువాత ఇప్పటివరకు మళ్లీ రోడ్డు వేయలేదు. రోడ్డుపై గుంతలు ఏర్పడడంతో తరు చూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని కాలనీవాసులు ఆవేదన చెందుతున్నారు. పలుమార్లు మున్సిపల్‌ అధికారులు వచ్చి చూసినా, ఎలాంటి మార్పు కనిపించడం లేదంటున్నారు. ఇప్పటికై నా రోడ్డును అభివృద్ధి చేయాలని వారు కోరుతున్నారు.

పట్టింపు లేదు

గుంతలు,పెచ్చులతో రోడ్డు పూర్తిగా చెడిపోవడం, సెట్‌బ్యాక్‌ను పట్టించుకోక ఇరుగ్గా మారడంతో ఈ రోడ్డు వెంట తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు కూడా రోడ్డు మీదనే ట్రాన్స్‌ఫార్మర్‌ వేశారు. వినాయక చవితికి డస్ట్‌ వేస్తరు..కాని నిమజ్జనం వరకు కూడా ఆ డస్ట్‌ ఉండడం లేదు. ప్రజాప్రతినిధులు పట్టించుకుని ఈ రోడ్డును వెంటనే అభివృద్ధి చేయాలి. – మడపతి రమాపతిరావు, మంకమ్మతోట

సమాధానం చెప్పాలి

నగరంలో ఎన్నో రోడ్లు అభివృద్ధి చేస్తున్నా ఈ రోడ్డును ఎందుకు పట్టించుకోవడం లేదో ప్రజాప్రతినిధులు చెప్పాలి. 2000 సంవత్సరంలో వేసిన సీసీ రోడ్డు, పూర్తిగా చెడిపోయినా మళ్లీ ఇప్పటివరకు రోడ్డు వేయలేదు. యూజీడీ తవ్వకాల తరువాత మరమ్మతులు కూడా చేయలేదు. ఎన్నిసార్లు అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసినా పట్టించుకోవడం లేదు. – బద్ధం నర్సింహారెడ్డి, న్యాయవాది

మరిన్ని వార్తలు