స్వశక్తి సంఘాల ఖాతాలపై ఈసీ నజర్‌

12 Nov, 2023 01:24 IST|Sakshi

కరీంనగర్‌ అర్బన్‌: శాసనసభ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం పకడ్బందీగా వ్యవహరిస్తోంది. గ్రామాల్లో గెలుపోటములను తీవ్రంగా ప్రభావితం చేయగల సత్తా స్వశక్తి సంఘ సభ్యులకు ఉంది. మహిళలను ప్రసన్నం చేసుకోవడానికి యత్నిస్తారనే సమాచారంతో ఈసీ మరింత అప్రమత్తమైంది. అభ్యర్థులు ఇప్పటికే గ్రామాల్లో సంఘం అధ్యక్షురాళ్ల మద్దతు కూడగట్టుకోవడానికి శత విధాలా మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసీ గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు సంఘాల ఆర్థిక లావాదేవీలు నిర్వహించే బ్యాంకు ఖాతాలు పరిశీలిస్తోంది. గ్రామ మహిళల్లో ఎక్కువ మంది స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా నమోదై ఉంటారు. సంఘాలను ప్రసన్నం చేసుకుంటే తమ గెలుపు నల్లేరుపై నడకేనని భావించిన వివిధ పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులు మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిచడం పరిపాటి. మహిళా సంఘాలు పొదుపు చేసుకునే, రుణాలు తీసుకునే బ్యాంకు ఖాతాలపై ఈసీ ప్రత్యేక దృష్టి సారించింది. సీ్త్రనిధి రుణాలు, వివిధ వ్యాపారాల మీద కమీషన్లు బ్యాంకుల్లో నిల్వ ఎంత ఉందనేది లెక్కలు పక్కాగా ఉంటాయి. ప్రభుత్వం నుంచి వచ్చే రుణాలు మినహా, మిగతా ఎక్కడి నుంచి వారి ఖాతాల్లో జమైనట్లు గుర్తించినా వారిపై చర్యలకు ఉపక్రమించనున్నారు.

మరిన్ని వార్తలు