ఓటరు పత్రం.. దారికి నేత్రం | Sakshi
Sakshi News home page

ఓటరు పత్రం.. దారికి నేత్రం

Published Sun, Nov 12 2023 1:24 AM

పోలింగ్‌ కేంద్రం మ్యాప్‌ - Sakshi

● వినూత్నంగా ముద్రణ.. ఇంటింటా పంపిణీ ప్రారంభం ● పోలింగ్‌ కేంద్రం సూచించేలా సమాచారం

కరీంనగర్‌ అర్బన్‌: శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాల్లో సౌకర్యాలు, సిబ్బంది కేటాయింపు ప్రక్రియ చేపట్టగా ఓటర్‌స్లిప్‌ల పంపిణీకి కసరత్తు చేస్తోంది. ఇంటింటా పోల్‌స్లిప్‌లు పంపిణీ చేసేలా బూత్‌లెవల్‌ అధికారులను ఇప్పటికే ఆదేశించగా స్లిప్‌లను పోలింగ్‌ కేంద్రాల వారీగా అప్పగించారు. ఈ మేరకు బీఎల్‌వోలు శుక్రవారం నుంచి ఇంటింటా పోల్‌స్లిప్‌లు పంపిణీ చేస్తున్నారు. కరీంనగర్‌, హుజూరాబాద్‌, చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాల్లో ఆయా ఆర్వోలు పంపిణీని పర్యవేక్షిస్తున్నారు.

పోల్‌ స్లిప్‌లు ప్రధానం..

పోలింగ్‌ రోజున ఓటరు ఓటు వేసేందుకు పోల్‌స్లిప్‌ ప్రధానం. ప్రతీఇంటికి స్లిప్‌లను అందించాలని, తదనుగుణంగా పర్యవేక్షణ ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి యంత్రాంగాన్ని నిర్దేశించారు. పంపిణీపై పదిరోజుల క్రితమే ఎన్నికల సంఘం గైడ్‌లెన్స్‌ జారీ చేసింది. ఓటర్ల జాబితా సర్వే, కొత్త ఓటర్ల నమోదు తదితర పనులు ఇప్పటికే పూర్తవగా శాసనసభ ఎన్నికల్లో ఈ సారి వినూత్నంగా ఓటర్‌ స్లిప్‌లను ముద్రించారు. గతంలో చిన్నస్లిప్‌లతో వివరాలు మాత్రమే ఉండేవి. ప్రస్తుత స్లిప్‌లో ఓటరు ఫొటో, వివరాలను పొందుపరిచారు. అలాగే పోలింగ్‌ కేంద్రం సంఖ్య, వివరాలున్నాయి. వెనుకవైపున పోలింగ్‌ కేంద్రానికి వెళ్లే దారి, ఏ ప్రాంతంలో ఉందో సూచిస్తూ చిత్రాన్ని పొందుపర్చారు. ఆ కేంద్రం బీఎల్‌వో ఫోన్‌ నంబర్‌, పేరు పేర్కొన్నారు.

రోజుకు 180 పంపిణీ

కరీంనగర్‌, హుజూరాబాద్‌, చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గంలో మండలాలకు ఇప్పటికే ఓటర్‌ స్లిప్‌లు చేరాయి. అయితే బీఎల్‌వోలు ఓటర్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని రోజుకు ఒక్కో బీఎల్‌వో 180 ఓటర్‌ స్లిప్‌లను పంపిణీ చేయాలి. ఒక్కో ఇంట్లో సగటున నలుగురు ఓటర్లు ఉన్నా రోజుకు కనీసం 45 ఇళ్లు తిరగాలి. సగటున గంటకు ఐదిళ్లు తిరగాలనుకున్నా రోజుకు 9 గంటల పాటు వారు ఇదే పనిలో ఉండాలి. జాబితా ప్రకారం ఇళ్లలో ఉన్న ఓటర్లలో కనీసం ఒక్కరైనా ఉన్నట్లు నిర్ధారించుకున్నాకే వాటినివ్వాలి. పంపిణీ చేసినట్లు సంతకం తీసుకోవాలి.

లేనివారికి పోలింగ్‌ కేంద్రం

సిబ్బంది ఇళ్లకు వెళ్లిన సమయంలో లేనివారి పోల్‌స్లిప్‌లు పోలింగ్‌ రోజున సంబంధిత పోలింగ్‌ కేంద్రం వద్ద అందుబాటులో ఉంచుతారు. వారితో పాటు చిరునామాలో లేనివారిని, డూప్లికేట్లుగా భావించి వారివి అందుబాటులో ఉంచుతారు. అక్కడ తగిన ఆధారం చూపి పోల్‌స్లిప్‌ పొందవచ్చు. పోల్‌స్లిప్‌ లేకపోయినా ఎన్నికల సంఘం పేర్కొన్న 13 రకాల్లో ఏదైనా గుర్తింపు పత్రం చూపినా ఓటరు జాబితాలో పేరుంటే ఓటు వేయవచ్చు.

నియోజకవర్గాలవారీగా ఓటర్లు.. పోలింగ్‌ కేంద్రాలు

కరీంనగర్‌ 3,41,913 390

చొప్పదండి 2,29,346 327

మానకొండూరు 2,18,413 316

హుజూరాబాద్‌ 2,44,514 305

జిల్లాలో మొత్తం ఓటర్లు: 10,34,186

పురుషులు: 5,09,498

మహిళలు: 5,24,630

ఇతరులు: 58

పోలింగ్‌ కేంద్రాలు: 1,338

బీఎల్‌వోలు: 1,338

ఒక్కోరోజు పంపిణీ చేయాల్సిన స్లిప్‌లు: 180

పోలింగ్‌ తేదీ: ఈ నెల 30

పంపిణీ చేయనున్న ఓటర్‌ స్లిప్‌
1/1

పంపిణీ చేయనున్న ఓటర్‌ స్లిప్‌

Advertisement
Advertisement