లక్ష్యం సాధిస్తే రూ.40 వేల కోట్ల టర్నోవర్‌

4 Oct, 2023 08:44 IST|Sakshi
వీడీయో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఅండ్‌ఎండీ శ్రీధర్‌, జీఎంలు

రూ.3,500 కోట్ల లాభాలు సాధ్యం

తొలి అర్ధ సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తిలో 7శాతం వృద్ధి

రోజుకు 2.10లక్షల టన్నుల ఉత్పత్తి సాధించాలి

సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ ఆదేశం 

గోదావరిఖని: దేశవ్యాప్తంగా బొగ్గుకు తీవ్రమైన డిమాండ్‌ ఏర్పడుతోందని, మిగిలిన ఆర్నెల్లలో రోజూ కనీసం 2.10 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సింగరేణి సంస్థ సీ అండ్‌ ఎండీ ఎన్‌.శ్రీధర్‌ ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో అన్నిఏరియాలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. వచ్చేఏడాది మార్చి చివరికల్లా 72 మిలియన్‌ టన్నుల లక్ష్యాన్ని అధిగమించాలని ఆదేశించారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ఆర్నెల్లలో వర్షాలతో కొంతఇబ్బంది కలిగినా అన్నిఅవరోధాలు అధిగమిస్తూ గతేడాది బొగ్గు రవాణాలో 12 శాతం వృద్ధి, ఉత్పత్తిలో 7శాతం, ఓవర్‌బర్డెన్‌ తొలగింపులో 15 శాతం వృద్ధి సాధించడంపై హర్షం వ్యక్తంచేశారు. ఈఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఆర్నెల్లు కీలకమని పేర్కొన్నారు. ఈ క్రమంలో అన్నిఏరియాలకు అవసరమైన యంత్రాలు, అనుమతులు, ఓబీ కాంట్రాక్టులు ఇప్పటికే సమకూర్చామన్నారు. ఇకపై వర్షప్రభావం ఉండే అవకాశం లేదన్నారు. ఓపెన్‌కాస్ట్‌ల్లో నిలిచిన నీటిని బయటకు తోడేయాలని, బొగ్గు ఉత్పత్తి, ఓవర్‌ బర్డెన్‌ తొలగింపును మరింత వేగవంతం చేయాలని సూచించారు.

లక్ష్యాలు సాధిస్తే రూ.3,500కోట్ల లాభాలు
ఈఏడాది నిర్దేశిత 72మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తే.. లక్ష్యానికి అనుగుణంగా రవాణా చేసే అవకాశం ఉందని సీఎండీ తెలిపారు. తద్వారా రూ.40 వేల కోట్ల టర్నోవర్‌, సుమారు రూ.3,500 కోట్ల లాభాలు సాధించే అవకాశం ఉందని తెలిపారు.

అంకిత భావంతో పనిచేయాలి
సింగరేణి ఉద్యోగులకు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకేదఫా రూ.1,750 కోట్ల వేజ్‌బోర్డు ఎరియర్స్‌ చెల్లించామని, సీఎం ప్రకటించినట్లు 32శాతం లాభాల బోనస్‌ రూ.711 కోట్లు కూడా దసరా పండుగకు ముందే విడుదల చేయనున్నామని పేర్కొన్నారు. దీపావళి బోనస్‌ను పండుగకు ముందే కార్మికుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. కంపెనీపై విశ్వాసం, విధుల్లో అంకితభావంతో కార్మిక, అధికారులు, సమష్టిగా కృషి చేయాలని కోరారు.

లక్ష్యాల అధిగమించిన సింగరేణి
ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు బొగ్గు ఉత్పత్తి, రవాణాలో సింగరేణి నిర్దేశిత లక్ష్యాలు సాధించిందని శ్రీధర్‌ అన్నారు. ఈ ఏడాది బొగ్గు రవాణా లక్ష్యం 307 లక్షల టన్నులు కాగా 330 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసి, 7 శాతం వృద్ధిని నమోదు చేసిందని వివరించారు. గతేడాది ఇదే సమయం కన్నా 12శాతం అధికమని పేర్కొన్నారు. సమావేశంలో డైరెక్టర్లు ఎన్‌.బలరాం, సత్యనారాయణరావు, వెంకటేశ్వర్‌రెడ్డి, అధికారులు సరేంద్రపాండే, అల్విన్‌, ఎం.సురేశ్‌, రమేశ్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు