నకిలీ శిక్షణ, నియామకాలు

12 Nov, 2023 01:22 IST|Sakshi
ఇటీవల పరీక్షల ప్రాధికార నిర్వహించిన పోస్టుల రాత పరీక్ష దృశ్యం

బనశంకరి: ప్రభుత్వ ఉద్యోగాలను ఇప్పిస్తామని అమాయకుల నుంచి గత రెండేళ్లుగా కోట్లాది రూపాయలను వసూలుచేసిన బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తితో పాటు ముగ్గురిని సీబీఐ అదికారులు అరెస్ట్‌చేశారు. ఈ స్కాంలో బెంగళూరుతో పాటు శుక్రవారం సీబీఐ అధికారులు పాట్నా, ముంబై, బెంగళూరు, మంగళూరు, ధన్‌బాద్‌ తదితర 9 ప్రాంతాల్లో దాడులు చేశారు. బెంగళూరులో అజయ్‌కుమార్‌, ధన్‌బాద్‌లో అమన్‌కుమార్‌, బిహార్‌లో అభి షేక్‌సింగ్‌ అనే ముగ్గురు పట్టుబడ్డారు. నిరుద్యోగుల నుంచి కోట్లాది రూపాయలను వసూలు చేసినట్లు విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. ఒక్కొక్కరి నుంచి రూ.10 లక్షల నుంచి 20 లక్షల వరకూ వసూలుచేశారు. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో నిరుద్యోగులకు నకిలీ శిక్షణ ఇచ్చి నకిలీ నియామక సర్టిఫికెట్లను అందజేశారు. ఇలా సుమారు 25 వేల మందికి మోసగించినట్లు భావిస్తున్నారు. ముంబైలోని సకినాకా శిక్షణకేంద్రంలో సోదాలు చేయగా కర్ణాటక, మహరాష్ట్రకు చెందిన వందలాది మంది బాధిత అభ్యర్థులు ఉన్నారు. నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్లు, శిక్షణ పేరుతో ఉన్న పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మంగళూరులో కూడా ఇటువంటి శిక్షణకేంద్రం ఏర్పాటుకు మోసగాళ్లు సన్నాహాలు చేశారు.

కేఈఏ కేసు సీఐడీకి

ఇటీవల కర్ణాటక పరీక్షల ప్రాధికార (కేఈఏ) నిర్వహించిన క్లర్కు, వివిధ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షల కేసును రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ పరీక్షల్లో బ్లూటూత్‌ ద్వారా కొందరు అభ్యర్థులు బయటివారి నుంచి సమాధానాలు తెలుసుకున్నారు. అక్రమాల పట్ల యాదగిరి పోలీస్‌స్టేషన్‌లో ఐదు కేసులు నమోదు కాగా హోంశాఖ సూచన మేరకు కేసును సీఐడీకి అప్పగించారు. రాష్ట్ర శాంతి భద్రతల విబాగం ఏడీజీపీ ఆర్‌.హితేంద్ర ఆ కేసుల ఫైళ్లను సీఐడి అధికారులకు అప్పగించారు. గతంలో ఎస్‌ఐ స్కాంలో బీజేపీ సర్కారుపై అప్పటి కాంగ్రెస్‌ నేతల విమర్శలు చేశారు. ఇప్పుడు కూడా పరీక్షల లీకేజీ బాగోతం బయటపడడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది.

ఆర్‌డీ పాటిల్‌ విచారణ

కేఈఏ పరీక్షల కేసుల్లో అరెస్టయిన లీకేజీల నిష్ణాతుడు ఆర్‌డీ పాటిల్‌ ను కలబుర్గి అశోకనగర పోలీస్‌స్టేషన్‌లోఉంచారు. గతంలో ఎస్‌ఐ ఉద్యోగాల స్కాంలో అరెస్టయి కొన్ని నెలలు జైలులో ఉండి బయటకు వచ్చాడు. మళ్లీ కేఈఏలో తలదూర్చినట్లు ఆరోపణలు వచ్చాయి. శనివారం ఆరోగ్యపరీక్షలు తదితరాలను పూర్తిచేసి కోర్టులో హాజరుపరిచే ముందు కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. పాటిల్‌ భార్య వచ్చి కలిసిన అనంతరం రోదిస్తూ ఇంటికి వెళ్లిపోయింది.

ఉద్యోగాల పేరుతో అమాయకులకు భారీగా వల

బెంగళూరు సహా దేశవ్యాప్తంగా నగరాలలో సీబీఐ దాడులు

ఉత్తుత్తి శిక్షణ, అపాయింట్‌మెంట్‌

ఆర్డర్ల దందా

మరిన్ని వార్తలు