13 ఏళ్ల బాలుడికి బ్లడ్‌ క్యాన్సర్‌

30 Nov, 2023 09:09 IST|Sakshi
అచ్యుత్‌ కుమార్‌తో తల్లిదండ్రులు

ఓర్వకల్లు: ఆటలాడుతూ.. అల్లరి చేసే ఆ బాలుడికి మాయదారి రోగం వచ్చింది. పేద కుటుంబానికి పెద్ద కష్టాన్ని తెచ్చి పెట్టింది. ఏడేళ్లుగా ఆ బాలుడు నరకయాతన అనుభవిస్తున్నాడు. ఆర్థిక స్థోమత లేక అపన్న హస్తం కోసం తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఓర్వకల్లు మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన కవిత, పరమేష్‌ దంపతులు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వీరికి అచ్యుత్‌ కుమార్‌, హర్షవర్ధన్‌ కుమారులు. పెద్ద కుమారుడు అచ్యుత్‌ కుమార్‌(13)కు ఆరేళ్ల వయస్సు నుంచి తరచుగా జ్వరం రావడం, రక్తకణాలు తగ్గిపోవడం జరుగుతూ ఉండేది.

తెలిసిన చోటల్లా అప్పులు చేసి వైద్యం చేయించారు. వైద్యానికి ఇప్పటికే సుమారు రూ.15 లక్షలు ఖర్చు చేశారు. ఈ ఏడాది మార్చిలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేర్పించగా పరీక్షల అనంతరం అక్కడి వైద్యులు బెంగళూరుకు రెఫర్‌ చేశారు. బెంగళూరులో వైద్య పరీక్షలు చేసి బ్లడ్‌ కాన్సర్‌గా వైద్యులు నిర్ధారించారు. ఈ వ్యాధి నయం కావాలంటే దాదాపు రూ.30 లక్షలు ఖర్చవుతుందని అక్కడి వైద్యులు తెలిపారు.

అంత డబ్బు లేక తల్లిదండ్రులు దిక్కుతోచక ఇంటికి వెనుతిరిగి వచ్చారు. కుమారుడి అవస్థ చూడలేకఇతరుల వద్ద అప్పులు చేసి కర్నూలులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు హైదరాబాద్‌లో శస్త్ర చికిత్స చేయాలని, రూ.20 లక్షలు ఖర్చు వస్తుందని చెప్పడంతో కొందరి సలహా మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధికింద దరఖాస్తు పెట్టుకున్నారు. ప్రభుత్వం రూ.8 లక్షల ఆర్థిక సహాయం అందజేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మిగతా రూ.12 లక్షల కోసం ఆ నిరుపేద తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు. దాతలు స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

 

మరిన్ని వార్తలు