ఆ గ్రామాల్లో ఎక్కడ చూసినా ఊటలే!.. నీటి ఊటతో కూలుతున్న ఇళ్లు

25 Dec, 2023 09:51 IST|Sakshi
భూత్పుర్‌లో ఉబికి వచ్చిన నీళ్లు . నీటి ఊట కారణంగా తాళం పడిన ఇల్లు

భూత్పుర్‌, నేరడుగం గ్రామాల్లో ఉబికి వస్తున్న నీళ్లు

భూత్పుర్‌, సంగంబండ రిజర్వాయర్లతో నిర్వాసితులకు ముప్పు

రోజురోజుకూ దయనీయంగా మారుతున్న వైనం

పట్టించుకోని అధికారులు, పాలకులు

మక్తల్‌: నారాయణపేట జిల్లా మక్తల్‌ నియోజకవర్గంలోని సంగంబండ, భూత్పుర్‌ రిజర్వాయర్ల ముంపు బాధితులకు మరో ముప్పు వచ్చి పడింది. ఉబికి వస్తున్న నీళ్లతో కునుకు లేని రాత్రులు గడపాల్సి వస్తోంది. నీటి ఊటలతో నివాసగృహాలు ధ్వంసమై కూలిపోతున్నాయి.

ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవించాల్సిన దుస్థితి నెలకొంది. ఇది మక్తల్‌ మండలం భూత్పుర్‌, మాగనూర్‌ మండలం నేరడుగాం ముంపు గ్రామాల ప్రజల దయనీయ పరిస్థితి. ఎన్నో ఏళ్ల నుంచి ఈ సమస్యతో సతమతమవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.

అందని పరిహారం..
2010 నవంబర్‌ 3న భూత్పుర్‌ను ముంపు గ్రామంగా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. గ్రామంలో 2,400 మంది జనాభా ఉంది. భూత్పుర్‌ రిజర్వాయర్‌లో 530 ఇళ్లు, 2,500 ఎకరాలు మునకకు గురవుతాయని అధికారులు గుర్తించారు. ఈ మేరకు అప్పట్లో ప్రభుత్వం తరి పొలానికి రూ.80 వేలు, మెట్టభూమి ఎకరాకు రూ.50వేల చొప్పున నష్టపరిహారం చెల్లించింది.

ఇళ్లు కోల్పోతున్న బాధితులకు నేటి వరకు నష్టపరిహారం చెల్లించకపోవడంతో నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిజర్వాయర్‌లో నీటిమట్టం పెరగడంతో గ్రామంలోకి నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముందుకుసాగని పునరావాసం పనులు..
భూత్పుర్‌ నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు 2015లో అధికారులు స్థలం ఎంపిక చేయగా.. ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకపోవడం, పునరావాస కేంద్రంలో ఎలాంటి వసతులు లేకపోవడంతో ముంపు గ్రామంలోనే నివాసముంటున్నారు. కొన్ని రోజులుగా రిజర్వాయర్‌ నీళ్లు ఇళ్లలోకి వస్తుండటంతో నిర్వాసితులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

నేరడుగం నిర్వాసితుల గోస..
సంగంబండ రిజర్వాయర్‌కు కట్టకింద ఉన్న నేరడుగాం గ్రామంలో దాదాపు 2,200 మంది జనాభా ఉన్నారు. గ్రామంలో 2,800 ఎకరాలు రిజర్వాయర్‌లో, 300 ఎకరాలు కాల్వల్లో ముంపునకు గురికాగా.. నేటి వరకు నష్టపరిహారం అందలేదు. అదేవిధంగా 746 ఇళ్లు రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్నట్లు అధికారులు గుర్తించి, నంబరింగ్‌ ఇచ్చారు.

నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకుగాను 150 ఎకరాలు అవసరమని తేల్చారు. అయితే నిర్వాసితులకు ఎలాంటి పరిహారం ఇవ్వకపోవడంతో ముంపు గ్రామంలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపు పదేళ్లు గడిచినా భూత్పుర్‌, నేరడుగాం నిర్వాసితుల సమస్య తీరడంలేదు. తమ గోడును ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కూలుతున్న ఇళ్లు.. 
సంగంబండ, భూత్పూర్‌ రిజర్వాయర్ల కారణంగా నేరడుగాం, భూత్పుర్‌ గ్రామాల్లో ఎక్కడ చూసినా నీటి ఊటలే కనిపిస్తున్నాయి. నీటి ఊటలతో నివాసగృహాలు కూలిపోతున్నాయి. రోజురోజుకూ నీళ్లు ఉబికి రావడం అధికం కావడంతో ముంపు బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వర్షాకాలంలో వారి పరిస్థితి మరీ దారుణంగా మారుతోంది. తమను పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆందోళనకు చెందుతున్నారు. ఉబికి వస్తున్న నీళ్లతో ఇళ్లలో ఉండలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.   

నష్టపరిహారం చెల్లించాలి..
రోజురోజుకూ భూత్పుర్‌ గ్రామంలో నివసించే పరిస్థితి లేకుండాపోతోంది. తమకు పునరావాసం కల్పించడంతో పాటు ఇళ్లు, స్థలాలను కోల్పోతున్న వారికి నష్టపరిహారం చెల్లించాలి. ఈ విషయంపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ సారించాలి. – కుర్వ హన్మంతు, సర్పంచ్‌, భూత్పుర్‌

ఇళ్లు కూలిపోతున్నాయి..
గ్రామంలో నీళ్లు ఉబికి వ స్తుండటంతో ఇళ్లు కూలిపోతున్నాయి. ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి నెలకొంది. గ్రామాన్ని ఖాళీ చేయక తప్పని పరిస్థితి ఉంది. అధికారులు గుర్తించిన 530 ఇళ్ల కు త్వరగా నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. – ఆనంధ్‌ శేఖర్‌, భూత్పుర్‌

ప్రభుత్వం ఆదుకోవాలి..
భూత్పుర్‌ నిర్వాసితులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలి. గ్రామంలో నీళ్లు ఉబికి వస్తుండడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ప్రభుత్వం పునరావాసం కల్పించాలి. – ఖతాల్‌ హుస్సేన్‌, కోఆప్షన్‌ సభ్యుడు, భూత్పుర్‌
 

>
మరిన్ని వార్తలు