Sakshi News home page

క్రిస్మస్‌కు ముస్తాబు

Published Mon, Dec 25 2023 12:54 AM

నారాయణపేటలో విద్యుద్దీపాల అలంకరణలో ఎంబీ మిస్పా చర్చి    - Sakshi

నారాయణపేట రూరల్‌: క్రిస్మస్‌ పర్వదినం పురస్కరించుకొని చర్చీలను ముస్తాబుచేశారు. పండగకు మరి కొన్ని గంటలు మాత్రమే గడువు ఉండటంతో ఇప్పటికే చర్చీలకు రంగులు వేసి విద్యుద్దీపాలతో అలంకరించారు. ముఖద్వారాలను అందంగా ఏర్పాటుచేశారు. చర్చీలు, ఇళ్లపై రంగురంగుల విద్యుత్తు దీపాలను ఉంచిన నక్షత్రాలను ఏర్పాటు చేశారు. నారాయణపేటలో ఎంబీ చర్చితో పాటు జిల్లాలోని అన్ని చర్చీల్లో ఏసుక్రీస్తు జననం, శాంతి సందేశాలు, జీవిత విషయాలతో కూడిన చిత్రవర్ణ పటాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆయా చర్చిలలో ముందస్తుగా క్రిస్మస్‌ సంబురాలు మొదలయ్యాయి. క్రైస్తవుల పండగ నిమిత్తం కొత్త దుస్తులు, వస్తు సామగ్రి కొనుగోలు చేశారు. చెట్లను కొనుగోలు చేసి ఇంటి ఆవరణలో విద్యుద్దీపాల మధ్య అలంకరిస్తున్నారు.

కోలాహలంగా చర్చిలు..

జిల్లా పరిధిలోని పలు గ్రామాల్లో ఉన్న చర్చిల్లో ముందస్తుగానే ముస్తాబు చేపట్టడంతో పండగ వాతావరణం నెలకొంది. విద్య, ఉద్యోగ, కార్మిక, వ్యాపార రంగాల్లో ఇతర ప్రాంతాల్లో నివాసముంటున్న వారు సైతం పండగకు సొంత గ్రామాలకు వచ్చారు. పట్టణంలోని పలు వ్యాపార సంస్థలు వినియోగదారులకు పండగకు సంబంధించిన వస్తువులను అందుబాటులో పెట్టారు. అదే విధంగా క్రిస్టియన్‌ యువజన సంఘాల సభ్యులు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో క్రిస్మస్‌ సంబురాలు జరుపుకొన్నారు. విద్యార్థులకు మిఠాయిలు, కేక్‌లు పంచిపెడుతూ ఆనందోత్సవాల మధ్య పండగకు సిద్ధమవుతున్నారు. ఆదివారం నుంచే కొన్ని చర్చిల ఆవరణలో ఏసుక్రీస్తు జననం, దేవుని జీవిత చరిత్ర, తదితర అంశాలను వివరిస్తున్నారు. అదేవిధంగా ప్రతి సాయంత్రం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తుండటంతో పలు చర్చిలు సందడిగా మారాయి.

విద్యుద్దీపాలతో చర్చీల అలంకరణ

సందడిగా మార్కెట్లు

Advertisement

What’s your opinion

Advertisement