డివైడర్‌ లేకపోవడంతో.. | Sakshi
Sakshi News home page

డివైడర్‌ లేకపోవడంతో..

Published Mon, Dec 25 2023 12:56 AM

-

మక్తల్‌: నిర్లక్ష్యంతో కూడిన డ్రైవింగ్‌ ఐదుగురి ప్రాణాలను బలితీసుకుంది. అతివేగం ఫలితంగా జాతీయ రహదారిపై రక్తపుటేరులు పారాయి. ఆదివారం సాయంత్రం నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం జక్లేర్‌ శివారులో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాన్ని చూస్తే ఈ విషయాన్నే ఎత్తిచూపుతున్నాయి. కర్ణాటక రాష్ట్రం సైదాపూర్‌ గ్రామానికి చెందిన మౌలాలి(43), భార్య రెహమాన్‌బేగం(40) అనారోగ్యానికి గురవడంతో మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట మండలంలోని సంకలమద్దిలో చికిత్స చేయించారు. తిరిగి ఆదివారం సాయంత్రం స్వగ్రామానికి వెళ్లేందుకు సమీప బంధువు ఖలీల్‌(43), మరో వ్యక్తి వడివాల్‌తో కలిసి కారులో బయలుదేరారు. ఇదిలా ఉండగా.. కర్ణాటక రాష్ట్రంలోని కార్వాల్‌లో పనిచేస్తున్న నేవీ ఉద్యోగి దీపక్‌ సమల్‌కు విశాఖపట్నానికి బదిలీ అయ్యింది. దీంతో భార్య భవిత సమల్‌(35), కూతురు అవిస్మిత సమల్‌(8)తో కలిసి కారులో హైదరాబాద్‌కు వెళ్లి అక్కడి నుంచి విశాఖపట్నం వెళ్తామని బంధువులకు సమాచారం ఇచ్చి బయలుదేరారు.

డివైడర్‌ లేకపోవడంతో..

నేషనల్‌ హైవే–167కు మధ్యలో డివైడర్‌ లేదు. దీంతో వాహనదారులు ఓవర్‌టెక్‌ చేసే సమయంలో ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొని ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే జక్లేర్‌ సమీపంలో వేగంగా వచ్చిన రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఐదుగురు మౌలాలి, రెహమాన్‌బేగం, ఖలీల్‌, భవిత సమల్‌, అవిస్మిత సమల్‌ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వెంటనే బాటసారులు పోలీసులకు సమాచారం అందించి సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు వచ్చి గాయపడిన వడివాల్‌, దీపక్‌ సమల్‌తోపాటు.. ఐదుగురి మృతదేహాలను మక్తల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇందులో దీపక్‌ సమల్‌ పరిస్థితి విషమించడంతో 108లో మహబూబ్‌నగర్‌కు తీసుకెళ్లారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పర్వతాలు తెలిపారు. అయితే నేవీ ఉద్యోగి దీపక్‌ది ఒడిశా రాష్ట్రంగా గుర్తించారు.

Advertisement
Advertisement