తండ్రిని కాపాడేందుకు వెళ్ళి.. కొడుకు కూడా అనంత లోకాలకు!

15 Jan, 2024 12:25 IST|Sakshi
శివాన్‌ (ఫైల్‌) . రుషికేష్‌ (ఫైల్‌)

ఒకరిని కాపాడబోయి మరొకరు..

వనపర్తి దళితవాడలో విషాదఛాయలు

వనపర్తిటౌన్‌: వనపర్తి జిల్లా కేంద్రంలోని దళితవాడలో సంక్రాంతి పండుగ వేళ విషాదం నెలకొంది. సమీపంలోని చెరువులో బట్టలు ఉతికి, చేపలు పట్టేందుకు తండ్రీకొడుకు వెళ్లగా.. ప్రమాదవశాత్తు తండ్రి చెరువులో పడ్డాడు. అతడిని కాపాడేందుకు వెళ్లిన కుమారుడు సైతం చెరువులో గల్లంతై మృతి చెందాడు. ఎస్‌ఐ జయన్న, స్థానికుల వివరాల మేరకు.. వనపర్తి దళితవాడకు చెందిన గంధం శివాన్‌ (58), అతడి కుమారుడు రుషికేష్‌ (29) బట్టలు ఉతికేందుకుగాను స్థానిక నల్లచెరువుకు వెళ్లారు.

చెరువులో బట్టలు ఉతకడంతో పాటు చేపల వేటకు గాలం వేశారు. ఈ క్రమంలో తండ్రి శివాన్‌ ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడు. గమనించిన కుమారుడు రుషికేష్‌ వెంటనే తన బాబాయ్‌కి ఫోన్‌చేసి ‘నాన్న చెరువులో జారిపడ్డాడు.. కాపాడేందుకు వెళ్తున్నా’నని చెప్పి ఫోన్‌ పెట్టేశాడు. కొద్దిసేపటికే అక్కడికి చేరుకున్న బాబాయ్‌కి తన అన్నాకొడుకు కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.

జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని కొండపేట నుంచి గజ ఈతగాళ్లను రప్పించి, గాలింపు చర్యలు చేపట్టారు. మొదట తండ్రి శివాన్‌ మృతదేహం లభించగా.. సాయంత్రం రుషికేష్‌ మృతదేహం లభ్యమైంది. తండ్రీకొడుకు మృతితో దళితవాడలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ జయన్న తెలిపారు.

>
మరిన్ని వార్తలు