ఎత్తుగడలో భాగమేనా.. | Sakshi
Sakshi News home page

ఎత్తుగడలో భాగమేనా..

Published Wed, Nov 15 2023 4:36 AM

- - Sakshi

మెదక్‌: ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసి బరిలో నిలబడడం ఎత్తుగడలో భాగమేనని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులే వారి అనుచరులతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేయించి ఎన్నికల సంఘం నిబంధనల మేరకు అభ్యర్థి ఉపయోగించే వాహనాలు, ఎన్నికల ఖర్చు, పోలింగ్‌ ఏజెంట్‌ తదితర లబ్ధిని పొందేలా చూస్తున్నారు.

మెదక్‌ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి మైనంపల్లి రోహిత్‌, బీజేపీ అభ్యర్థి పంజా విజయ్‌కుమార్‌ ప్రధాన పార్టీలకు చెందిన వారు. వీరితోపాటు గుర్తింపు పొందిన పార్టీల నుంచి ఆరుగురు, స్వతంత్ర అభ్యర్థులుగా తొమ్మిది మంది నామినేషన్లు వేశారు. ఈ నెల 13న జరిగిన స్క్రూటీలో జంగంపల్లి రంగాగౌడ్‌ అనే స్వతంత్ర అభ్యర్థి అఫిడవిట్‌ సరిగా లేనందున నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. ప్రస్తుతం ఎనిమిది మంది స్వతంత్ర అభ్యర్థులు, ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులు, మరో ఆరుగురు వివిధ పార్టీలకు చెందినవారు, మొత్తం 17 మంది బరిలో ఉన్నారు.

రూ.40 లక్షల వరకు ఖర్చు

స్వతంత్ర అభ్యర్థులుగా ఎనిమిది మంది బరిలో ఉండగా, ఇందులో మైనంపల్లి వర్గానికి చెందిన వారు ఒకరు. పద్మాదేవేందర్‌రెడ్డి వర్గానికి చెందిన వారు మరొకరు ఉన్నట్లు తెలిసింది. ఎన్నికల నిబంధనల మేరకు ఒక్కో అభ్యర్థి రూ.40 లక్షల మేర ఖర్చు చేసే వీలుంటుంది. అభ్యర్థులు ప్రచార వాహనాలు ఉపయోగించడం, పోలింగ్‌ బూత్‌లలో ఏజెంట్ల ఏర్పాటు, ఇతర ఖర్చులు చేసుకోవచ్చు. ఇందులో భాగంగానే స్వతంత్ర అభ్యర్థుల పేరుతో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఖర్చు చేసేందుకు వీలు ఉంటుంది. అందుకే ప్రధాన పార్టీల అభ్యర్థులు వివిధ పార్టీల గుర్తుపై స్వతంత్ర అభ్యర్థులను బరిలోకి దించడం ఎత్తుగడలో భాగమే అని పలువురు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు.

ఉపసంహరణలకు నేడు ఆఖరు..

ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి నేడు (బుధవారం) చివరి అవకాశం. ఒక వేళ విత్‌ డ్రా చేసుకోకుంటే ఆయా పార్టీల గుర్తులతోపాటు స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులను ఎన్నికల సంఘం అందజేస్తుంది.

గత ఎన్నికల్లో ప్రధాన పార్టీకి గండి

2018 ఎన్నికల్లో మెదక్‌ స్వతంత్ర అభ్యర్థికి రోడ్డు రోలర్‌ గుర్తు కేటాయించారు. దీంతో ఆ ఎన్నికల్లో రోడ్డు రోలర్‌ గుర్తు అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు. 4వ స్థానంలో బీజేపీ అభ్యర్థి రాజయ్య నిలిచారు. ఇందుకు ప్రధాన కారణం కారు గుర్తును పోలిన రోడ్డు రోలర్‌ ఉండడమే అని తెలస్తుంది.

స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు

ఎన్నికల లెక్కలు కలిసొచ్చేందుకు, ప్రత్యర్థిని దెబ్బతీసేందుకు

మెదక్‌ నియోజకవర్గానికి 18 మంది నామినేషన్లు

పరిశీలనలో ఒకటి తిరస్కరణ

ఉపసంహరణకు నేడే ఆఖరు

Advertisement
Advertisement