వాస్తవ కథల ఆధారంగా తీసిన 'మురారి'

17 Feb, 2021 16:12 IST|Sakshi

హీరో మహేష్‌బాబు కెరియర్‌లోనే తొలి బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన చిత్రం 'మురారి'. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలై నేటికి 20 ఏళ్లు పూర్తయ్యింది. దీంతో సోషల్‌ మీడియాలో   #20YearsForMurari హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతుంది. ఈ సినిమాతోనే నటి సోనాలి బింద్రే తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే ఆమె నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కథాంశం, కుటుంబ భావోద్వేగాలు, మణిశర్మ సంగీతం..ఇలా ఈ చిత్రంలోని ప్రతీ అంశం ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. దాని ఫలితమే బాక్స్‌ఫీస్‌ వద్ద వసూళ్ల సునామీ కురిపించింది. మురారి విడుదలై 20 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ మూవీకి  సంబంధించిన ఇంట్రస్టింగ్‌ విశేషాలు..

కృస్ణవంశీ ఈ సినిమాను ఎంతో వైవిధ్యంగా తెరకెక్కించాడు. నిజానికి మురారి కథ నిజజీవిత సంఘనల ఆధారంగా తీశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓ పేరున్న జమీందార్‌ బ్రిటిష్ వారి కోసం తమ ఇలవేల్పు అయిన అమ్మవారి పంచలోహ విగ్రహాన్ని దొంగిలిస్తాడు. దీంతో అమ్మవారి ఆగ్రహానికి గురై అతడు చనిపోతాడు. అంతేగాక తన వంశానికి ఒక శాపాన్ని పొందుతాడు. అప్పటి నుంచి ప్రతీ 48 ఏళ్ళకొకసారి వచ్చే ఆశ్వయిజ బహుళ అమావాస్య నాడు ఆ జమీందార్ ఇంటిలోని వారసుల్లో ఒకరు మరణిస్తూ ఉంటారు. ఆ తర్వాత హీరో కూడా మరణిస్తారని భావించిన నేపథ్యంలో ఆయన చనిపోతాడా లేదా? ఆ శాపం నుంచి ఎలాంటి విముక్తి పొందుతారు అన్న అంశాలకు ఆధ్యాత్మికత జోడించి ఎక్కడా బోర్‌ కొట్టకుండా సినిమాను రక్తికట్టించడంలో కృష్ణవంశీ సక్సెస్‌ అయ్యాడు. 

ఈ సినిమాకు ముందే మహేష్‌ 3 సినిమాల్లో నటించినా మురారీ మాత్రం ఆయన కెరియర్‌లోనే తొలి సిల్వర్‌ జూబ్లీ చిత్రంగా నిలిచింది. కేవలం 5కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది. దాదాపు 23 కేంద్రాల్లో ఈ చిత్రం శతదినోత్సవం జరుపుకుంది.  మహేశ్ బాబు కెరీర్ లో ఓ మైల్ స్టోన్‌గా నిలిచిన మురారి సినిమా తన ఆల్‌ టైం ఫెవరెట్‌ సినిమా అని మహేష్‌ భార్య నమ్రత అన్నారు. మురారి ఎప్పటికీ మర్చిపోలేని చిత్రమన్నారు. 

ఇక మురారి సినిమా పరంగానే కాకుండా, మ్యూజికల్‌గానూ సూపర్‌ డూపర్‌ హిట్‌ అందుకుంది. ఈ చిత్రానికి మణిశర్మ అందించిన పాటలు ఎవర్‌గ్రీన్‌. ముఖ్యంగా 'అలనాటి రాముచంద్రుడి' ....అనే పాట ఇప్పటికీ ప్రతి తెలుగింటి పెళ్లి వేడుకల్లో మార్మోగుతూనే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 


మరిన్ని వార్తలు