కోర్టుపై నమ్మకం పోయింది: కంగనా రనౌత్‌

21 Sep, 2021 01:18 IST|Sakshi

పరువు నష్టం కేసులో నటి కంగనా రనౌత్‌ వ్యాఖ్య

ముంబై: బెయిల్‌ వచ్చే అవకాశమున్న కేసుల్లోనూ ఖచ్చితంగా కోర్టుకు రావాల్సిందేనని, లేదంటే వారెంట్లు పంపుతానంటూ కోర్టు పరోక్షంగా బెదిరిస్తోందని, కోర్టుపై నమ్మకం పోయిందని బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ వ్యాఖ్యానించారు. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంపై ఓ ఇంటర్వ్యూలో నటుడు హృతిక్‌ రోషన్, ప్రముఖ గీత రచయిత జావెద్‌ అక్తర్‌లను పరోక్షంగా ఉద్దేశిస్తూ ‘బాలీవుడ్‌లో కోటరీ వ్యవస్థ వేళ్లూనుకుంది’ అని కంగన అన్నారు. దీంతో కంగనపై జావెద్‌ అక్తర్‌ గతంలో పరువు నష్టం కేసు వేశారు.

ఈ కేసులో తమ ముందు హాజరుకావాలంటూ ముంబైలోని అంధేరి మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కంగనకు ఫిబ్రవరి నుంచి పలుమార్లు సమన్లు జారీచేశారు. దీంతో ఎట్టకేలకు సోమవారం కంగన కోర్టుకొచ్చారు. బెయిల్‌ వచ్చే అవకాశమున్న కేసుల్లోనూ ప్రత్యక్షంగా హాజరవ్వాల్సిందే, లేదంటే వారెంట్‌ జారీచేస్తామని కోర్టు రెండుసార్లు పరోక్షంగా బెదిరించిందని ఆమె వ్యాఖ్యానించారు. కేసు దర్యాప్తు తమకు వ్యతిరేకంగా సాగుతోందని, వేరే కోర్టుకు కేసును బదలాయించాలని చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ముందు ఆమె సోమవారం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై కోర్టు అక్టోబర్‌ ఒకటిన విచారించనుంది.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు