ప్లీజ్‌.. సంరక్షకుడిగా నా తండ్రిని తప్పించండి: బ్రిట్నీ స్పియర్స్‌ వేడుకోలు

24 Jun, 2021 11:52 IST|Sakshi

‘‘నా జీవితం సంతోషంగా ఉందన్నది పచ్చి అబద్ధం. ఇప్పుడు నిజం చెబుతున్నా.. గత 13 ఏళ్లులో ఏరోజూ సంతోషంగా లేను. రోజూ ఏడుస్తూనే ఉన్నా. కోపం, బాధ అన్నీ కలగలిసి వస్తున్నాయి. ఆయన చెర నుంచి నన్ను విడిపించండి సర్‌’’ అంటూ పాప్‌ సింగర్‌ బ్రిట్నీ స్పియర్స్‌ దీనంగా జడ్జిని వేడుకోవడం పలువురిని కంటతడి పెట్టిచ్చింది.   

సాక్రామెంటో: పాప్‌ సెన్సేషన్‌ బ్రిట్నీ స్పియర్స్‌ తన సొంత తండ్రిపైనే సంచలన ఆరోపణలకు దిగింది. తన తండ్రి జేమీ స్పియర్స్‌ తన జీవితాన్ని నాశనం చేశాడని, అతని చెర నుంచి విముక్తి కల్పించాలని ఆమె న్యాయస్థానాన్ని కోరింది. తన సంరక్షకుడి హోదా నుంచి తండ్రి జేమీని తప్పించాలంటూ బ్రిట్నీ, కాలిఫోర్నియా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. బుధవారం ఈ పిటిషన్‌ మీద వాదనలు జరగ్గా.. 20 నిమిషాలపాటు ఏకధాటిన బ్రిట్నీ, జడ్జి ముందు కన్నీళ్లతో తన గొడును వెల్లబోసుకుంది. బలవంతంగా ఆయన్ని తన సంరక్షకుడిగా నియమించారని, కానీ,  ఆ తర్వాతే తన జీవితం నాశనం అయ్యిందని బ్రిట్నీ వాపోయింది.


‘‘ఆయన వల్ల రోజూ నరకం అనుభవించా. ఇష్టం లేకున్నా గంటల తరబడి పని చేశా. డబ్బు, హోదా అన్నీ ఆయనే అనుభవించాడు. నా సంపాదన ఒకటో వంతును కూడా నా ఖర్చులకు ఇవ్వలేదు. నా ఫోన్‌ దగ్గరి నుంచి విలువైన కార్డుల దాకా అన్నీ ఆయన కంట్రోల్‌లో ఉండిపోయాయి. రోజూ నాకు లిథియం డ్రగ్‌ ఎక్కించేవాడు. నా పిల్లలకు నన్ను దూరం చేశాడు. మళ్లీ పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలనే నా ఆశలకు అడ్డుపడ్డాడు. ఆయన సంరక్షణ నాకు మంచి కంటే చెడు ఎక్కువగా చేసింది. ఒకరకంగా ఇది ‘సెక్స్‌ ట్రాఫికింగ్‌’కి సమానం. ఇకనైనా నా జీవితం నాకు ఇప్పించండి’’ అంటూ కన్నీళ్లతో బ్రిట్నీ జడ్జిని వేడుకుంది.

నా కూతురే కదా!
ఇక బ్రిట్నీకి మొదటి నుంచి ఈ కేసులో ఫ్యాన్స్‌ మద్ధతు ఇస్తూనే వస్తున్నారు. బుధవారం కోర్టు బయట ఫ్రీ బ్రిట్నీ మూమెంట్‌లో భాగంగా ర్యాలీ కూడా నిర్వహించారు. వాదనలు జరుగుతున్నంత సేపు బయట బ్రిట్నీ అనుకూల నినాదాలు చేశారు. అయితే కూతురి పిటిషన్‌పై జేమీ స్పియర్‌ తేలికగా స్పందించారు. ఆమెకు తానేం బలవంతపు గార్డియన్‌గా లేనని, స్వచ్ఛందంగానే ఉన్నానని, ఆమె ఆరోపణలను అబద్ధమని, అయినా తాను తన కూతురిపై మమకారం ఉందని చెబుతూ జేమీ తరపున ఆయన లాయర్‌ ఒక స్టేట్‌మెంట్‌ రిలీజ్‌ చేశాడు. 

పాప్‌ సెన్సేషన్‌ 39 ఏళ్ల బ్రిట్నీ స్పియర్స్‌.. 2004లో జేసన్‌ అనే వ్యక్తిని పెళ్లాడి.. నెలలు తిరగ్గకముందే విడాకులు ఇచ్చేసింది. ఆ తర్వాత అమెరికన్‌ ర్యాపర్‌ కెవిన్‌ ఫెడెర్‌లైన్‌ను పెళ్లాడి.. మూడేళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి తండ్రి సంరక్షణలో ఉంటున్న బ్రిట్నీ.. మానసిక సమస్యలతో బాగా కుంగిపోయింది. ఒకానొక టైంలో గుండు చేయించుకుని అభిమానులకు షాక్‌ ఇచ్చిందామె.

చదవండి: రోజుకు ఆరుసార్లు!

మరిన్ని వార్తలు