కరోనాతో ‘ హెచ్‌.ఎం.వి.’ మంగపతి మృతి

13 May, 2021 01:34 IST|Sakshi

ప్రసిద్ధ హెచ్‌.ఎం.వి. గ్రామ్‌ ఫోన్‌ రికార్డుల సంస్థ ద్వారా ‘హెచ్‌.ఎం.వి.’ మంగపతిగా పేరొందిన గాయకులు, సంగీత ప్రియులు  పుట్టా మంగపతి కరోనాతో మంగళవారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. హెచ్‌.ఎం.వి. సంస్థ దక్షిణాది విభాగానికి అధిపతిగా, సలహాదారుగా ఆయన సేవలందించారు. ఘంటసాలతో ‘భగవద్గీత’, అనేక ప్రైవేట్‌ గీతాలు పాడించింది మంగపతే. అలాగే ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మితో ‘అన్నమయ్య సంకీర్తనలు’ పాడించారు. తిరుపతి స్వస్థలమైన మంగపతి కొంతకాలం టి.టి.డిలో, రైల్వే శాఖలో చేశారు. నాటక కళాకారుడైన ఆయన సినీ సంగీత దర్శకుడిగా, గాయకుడిగా రాణించాలని భావించారు.

దర్శక పితామహుడు హెచ్‌.ఎం. రెడ్డి రూపొందించిన ‘తెనాలి రామకృష్ణ’, ‘ఘరానాదొంగ’, ‘నిర్దోషి’ చిత్రాల్లో నటించారు. కొన్ని చిత్రాలకు దర్శకత్వ శాఖలో చేశారు. ‘‘నేను ఒకవేళ వేయి సినిమాలకు దర్శకత్వం వహించినా, నిర్మించినా అది ఘంటసాల గారి చేత గానం చేయించిన భగవద్గీతకు తూగవని చెప్పగలను’’ అని మంగపతి అంటుండేవారు. రవి అనే కలం పేరుతో ఆయన రాసిన కొన్ని భక్తిగీతాలను ఘంటసాల స్వీయ సంగీతంలో, గానం చేశారు. దక్షిణాదిన వివిధ భాషల్లోని కర్ణాటక, లలిత, సినీ సంగీతంలోని పలువురు గాయనీ గాయకులను, రచయితలను మంగపతి పరిచయం చేశారు. 97 ఏళ్ళ మంగపతి ‘స్వరసేవ’ పేరిట పాటల రికార్డింగ్‌ అనుభవాలను పుస్తక రూపంలో అందించారు.

మరిన్ని వార్తలు