Atrocity case : దాసరి అరుణ్‌పై అట్రాసిటీ కేసు 

18 Aug, 2021 08:25 IST|Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: ప్రముఖ దర్శకుడు దివంగత దాసరి నారాయణరావు చిన్న కుమారుడు దాసరి అరుణ్‌కుమార్‌పై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఐపీసీ 504, 506, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొల్లారానికి చెందిన బ్యాగరి నర్సింహులు వెంకటేష్‌ అనే టెక్నీషియన్‌ 2012 నుంచి 2016 వరకు దాసరి నారాయణరావు వద్ద మూవీ రిస్టోరేషన్‌ ఔట్‌సోర్సింగ్‌ పనులు చేశారు. దాసరి కుమారులు ప్రభు, అరుణ్‌కుమార్‌  బాగా పరిచయం. 2018 నవంబర్‌ 15న దాసరి మరణించిన అనంతరం పాత ఒప్పందం రద్దు చేసి కొత్త ఒప్పందం కుదుర్చుకున్నారు.
(చదవండి: ఆ ఫొటో వల్లే సినిమా ఛాన్స్‌ వచ్చింది : వైశాలీ రాజ్‌)

ఇటీవల డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఒప్పందంపై తాను సంతకం చేయలేదని అరుణ్‌ చెప్పారు. ఈ నెల 13న రాత్రి 9 గంటల సమయంలో తన డబ్బుల గురించి అడిగినప్పుడు ఎఫ్‌ఎన్‌సీసీకి రమ్మని చెప్పగా చక్రపాణి అనే ప్రత్యక్ష సాక్షిని తీసుకొని వెళ్లానని బాధితుడు తెలిపారు. అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికే అరుణ్‌కుమార్‌ కులం పేరుతో తనను దూషించారని, నీ అంతు చూస్తానంటూ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను కులం పేరుతో దూషించడంతో పాటు ఆయన నుంచి తనకు ప్రాణహాని ఉందని ఈ నెల 16న బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరుణ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు