‘నారప్ప’లో ఎక్కడా వెంకటేష్ కనిపించలేదు: చిరంజీవి

24 Jul, 2021 11:54 IST|Sakshi

వెంకటేష్‌ నటించిన నారప్ప చిత్రం జూలై 20న అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల అయి, సర్వత్రా  పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది. తమిళంలో అఖండ విజయం సొంతం చేసుకున్న అసురన్‌కి రీమేక్‌ ఇది. ఇందులో వెంకీ నటన ఓ రేంజ్‌లో ఉందని అభిమానులు పండగ చేసుకుంటుండగా, మరోవైపు విమర్శకుల నుంచి సైతం నుంచి నారప్పకు ప్రశంసలు అందుతున్నాయి. ఈ నేపథ‍్యంలో ఇటీవల ఓటీటీలో విడుదలైన చిత్రాల జాబితాలో బిగ్గస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ దిశగా ఈ చిత్రం దూసుకుపోతోంది. తాజాగా ఈ చిత్రం చూసిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి దీనిపై స్పందించారు.


తమిళ రీమేక్‌ చిత్రాలు తెలుగులో విజయం సాధించడం అరుదనే చెప్పాలి. అందుకు ఇటీవల విడుదలైన ‘జాను’ సినిమానే ఉదాహరణ. అక్కడ అఖండ విజయం సొం‍త చేసుకున్న ‘96’ రీమేక్‌గా టాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చినా, అంతగా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. కానీ వెంకీ ‘నారప్ప’ మాత్రం ఇందుకు భిన్నంగా తమిళంలో ఎంతటి విజయం సాధించిందో తెలుగులోను అదే రేంజ్‌ విజయం దిశగా దూసుకుపోతుంది. ఇప్పటికే సోషల్‌ మీడియాలో నారప్పలో వెంకీ నటనకు నెటిజన్లు కామెంట్లు, మీమ్స్‌తో ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి వెంకీ నటనను అభినందిస్తూ ఓ ఆడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

 ఆ పోస్ట్‌లో.. కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు