Ninne Chustu Movie: పగ వర్సెస్‌ ప్రేమ.. నిన్నే చూస్తు రివ్యూ

27 Oct, 2022 21:31 IST|Sakshi

టైటిల్‌ : నిన్నే చూస్తు
దర్శకుడు: కె. గోవర్ధనరావు
నటీనటులు: శ్రీకాంత్ గుర్రం, బుజ్జి(హేమలత రెడ్డి), సుహాసిని, సుమన్, సాయాజి షిండే, భానుచందర్, కిన్నెర, జబర్దస్త్‌ మహేష్ తదితరులు
బ్యానర్ : వీరభద్ర క్రియేషన్స్
ప్రొడ్యూసర్: పోతిరెడ్డి హేమలత రెడ్డి
సంగీతం: రమణ్ రాతోడ్
ఎడిటర్ : నాగిరెడ్డి
కెమెరా : ఈదర ప్రసాద్
విడుదల తేదీ: అక్టోబర్‌ 27, 2022

శ్రీకాంత్ గుర్రం, బుజ్జి (హేమలతా రెడ్డి) హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం నిన్నే చూస్తు. ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అక్టోబర్‌ 27న విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం..

కథ 
అమలాపురంలో ఉండే కృష్ణ (శ్రీకాంత్ గుర్రం) తన తండ్రి బాను చందర్‌ను హత్య చేసిన వారిని చంపాలని రగిలిపోతుంటాడు. బ్యాగ్‌లో గన్ పెట్టుకొని తల్లి సుహాసినికి ఇంటర్వ్యూ పేరుతో బయటకు వెళ్లి తన తండ్రిని చంపిన వారిని వెదుకుతూ ఉంటాడు. చివరకు తన తండ్రిని చంపిన వ్యక్తి వైజాగ్‌లో ఉన్నాడని తెలిసి అక్కడకు వెళ్లి చంపడానికి ట్రై చేస్తే అది మిస్ అవుతుంది. వైజాగ్‌లోని ప్రముఖ వ్యాపారవేత్త జగదీశ్ చంద్ర ప్రసాద్ (సుమన్), ఇంద్ర (కిన్నెర)ల కూతురు సత్య (హేమలతా రెడ్డి/ బుజ్జి ) అమెరికాలో చదువుకుని ఇండియాకు తిరిగి వస్తుంది. తన ఫ్రెండ్ స్వాతి(ప్రెసిడెంట్ కూతురు)ని కలవడానికి అమలాపురం వస్తుంది సత్య. 

ఈ క్రమంలో హీరోహీరోయిన్లిద్దరూ ప్రేమలో పడతారు. వీరి ప్రేమను కృష్ణ అమ్మ కూడా ఒప్పు కుంటుంది. పెద్దలతో మాట్లాడి పెళ్లి చేసుకుందాం వైజాగ్ రమ్మంటుంది సత్య. దాంతో వైజాగ్ వెళ్లిన కృష్ణకు ఇంతకాలం తను చంపాలనుకున్న వ్యక్తి, ఎంతో ఇష్టంగా ప్రేమించిన సత్య తండ్రి జగదీశ్ చంద్ర ప్రసాద్ ఇద్దరూ ఒక్కరే అని తెలుసుకుంటాడు. అతడి మీద కోపంతో సత్యతో  నువ్వంటే ఇష్టం లేదు "ఐ హేట్  యు" అని చెప్పి వస్తాడు. దీంతో సత్య తల్లి ఇంద్ర (కిన్నెర) సొంత అన్న అయిన సాయాజి షిండే కొడుకుతో సత్యకు పెళ్లి ఫిక్స్ చేస్తారు. అసలు జగదీశ్ చంద్ర ప్రసాద్ కృష్ణ నాన్న భానుచందర్‌ను ఎందుకు చంపాడు? జగదీశ్‌ను కృష్ణ చంపాడా లేదా? సత్య కృష్ణను పెళ్లాడిందా? లేక తన బావను పెళ్లి చేసుకుందా? అన్న విషయాలు తెలియాలంటే "నిన్నే చూస్తు".. సినిమా చూడాల్సిందే!

నటీనటుల పనితీరు 
అమ్మను ప్రేమగా చూసుకొనే  కొడుకుగా, సత్యను ప్రేమించే లవర్‌గా, మరో వైపు తండ్రిని చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకునే కొడుకుగా పలు షేడ్స్ వున్న పాత్రలో శ్రీకాంత్‌ చక్కగా నటించాడు. ఒక వైపు నిర్మాతగా మరోవైపు హీరోయిన్‌గా బుజ్జి(హేమలతా రెడ్డి) ఆకట్టుకుంటుంది. హీరోహీరోయిన్స్‌ తల్లిదండ్రులు, హీరో ఫ్రెండ్స్‌ వారి పాత్రలకు తగ్గట్లు నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు 
కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా ప్రేమ ఎప్పుడూ ఓడిపోకూడదు అనే ఆలోచనను దర్శకుడు కె గోవర్ధనరావు అద్భుతంగా తెరకెక్కించాడు. రమణ్ రాథోడ్ సంగీతం బాగుంది. సినిమాటోగ్రాఫర్ ఈదర ప్రసాద్ అందించిన విజువల్స్ పర్వాలేదు. లవ్ కు స్టార్స్ ఇవ్వకూడదు, ప్రేమను ప్రేమగా గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి లాంటి డైలాగ్స్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయి. నాగిరెడ్డి ఇంకాస్త ఎడిటింగ్ చేసుంటే బాగుండేది.

చదవండి: అప్పుడే సమంతతో లవ్‌లో పడ్డా: విజయ్‌ దేవరకొండ
బన్నీ భార్య స్నేహారెడ్డి చీర ఖరీదెంతో తెలుసా?

మరిన్ని వార్తలు