మాస్టర్‌ సినిమాకు ఏకంగా మూడు అవార్డులు..

24 May, 2023 11:59 IST|Sakshi

ఒసాకా తమిళ్‌ అంతర్జాతీయ 2021 సినీ అవార్డుల వేడుక ఇటీవల జపాన్‌లో జరిగింది. ఈ వేదికపై 2021 ఏడాదికి గానూ తమిళ చిత్రాలకు అవార్డులను ప్రకటించారు. అందులో మాస్టర్‌ చిత్రంలోని నటనకు గానూ కథానాయకుడు విజయ్‌కు ఉత్తమ నటుడు అవార్డును ప్రకటించారు. మాళవికా మోహన్‌ హీరోయిన్‌గా నటించిన ఇందులో నటుడు విజయ్‌సేతుపతి ప్రతినాయకుడిగా నటించారు. లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 7 స్క్రీన్‌ స్టూడియోస్‌, ఎక్స్‌బీ.ఫిలిం క్రియేటర్స్‌ సంస్థలు నిర్మించాయి.

ఇందులో నటించిన విజయ్‌సేతుపతికి ఉత్తమ ప్రతినాయకుడు అవార్డును ప్రకటించారు. ఈ చిత్రంలోని వాత్తి కమింగ్‌ పాట ఉత్తమ పాట అవార్డును గెలుచుకుంది. ఆ విధంగా మాస్టర్‌ చిత్రం మూడు అవార్డులను కై వసం చేసుకుంది. ఇకపోతే తలైవి చిత్రంలో నటనకు గానూ నటి కంగనారనౌత్‌కు ఉత్తమ నటి అవార్డు వరించింది. అదే విధంగా సార్పట్ట పరంపరై చిత్రానికి గానూ పా.రంజిత్‌ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు.

బెస్ట్‌ స్క్రీన్‌ ప్లే అవార్డును మానాడు చిత్రానికి గానూ దర్శకుడు వెంకట్‌ప్రభు గెలుచుకున్నారు. ఉత్తమ నిర్మాణ సంస్థ అవార్డును మండేలా చిత్రానికి గానూ వైనాట్‌ స్టూడియోస్‌, రిలయన్స్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌, ఓపెన్‌ విండో ప్రొడక్షన్స్‌, విష్‌బెర్రి ఫిలింస్‌ సంస్థలు గెలుచుకున్నాయని అవార్డుల జ్యూరీ అధికారికంగా ప్రకటించింది.

చదవండి: విషాదం.. కారు ప్రమాదంలో నటి మృతి

మరిన్ని వార్తలు