అందుకే ప్రమోషన్స్‌కు రావడం లేదట.. అగ్రనటిపై విమర్శలు

6 Dec, 2021 11:01 IST|Sakshi

చైన్నై సినిమా: ఒక తమిళ అగ్రనటిని నిర్మాత, నటుడు కె.రాజన్‌ ఘాటుగా విమర్శించారు. జీఎన్‌ఏ ఫిలిమ్స్‌ పతాకంపై జయరాజ్‌ ఆర్‌. వినాయక సునీల్‌ కలిసి నిర్మించిన చిత్రం 'గ్రాండ్‌ మా'. షిజన్‌ లాల్‌ ఎస్‌ఎస్‌ దర్శకత్వం వహించిన ఇందులో సోనియ అగర్వాల్, విమలారామన్, ఛార్మిళ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. మలయాళం, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్‌ ఆవిష్కరణ శనివారం చెన్నైలో జరిగింది. 

ముఖ్య అతిథిగా హాజరైనా కె. రాజన్‌ మాట్లాడుతూ.. తమిళ చిత్ర పరిశ్రమ మలయాళ చిత్ర పరిశ్రమను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ చిత్ర షూటింగ్‌ను 23 రోజుల్లో పూర్తి చేసినట్లు, షూటింగ్‌లో ఒక్క కేరవాన్‌ కూడా వాడలేదని దర్శకుడు చెప్పారన్నారు. చిత్ర ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమానికి నటీనటులందరూ విచ్చేశారని, తమిళంలో అగ్ర కథానాయికగా రాణిస్తున్న ఒక నటి మాత్రం చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాలకు రావడం లేదన్నారు. అదేమని అడిగితే తాను వెళ్లి చిత్రం బాగుందని చెప్పి ఆ చిత్రం ఫ్లాప్‌ అయితే తనకు చెడ్డ పేరు వస్తుందని చెబుతోందన్నారు. రూ.5 కోట్లు తీసుకుంటున్న ఆమెకు చిత్రం ఫ్లాప్‌ అవుతుందని ముందుగా తెలియదా అంటూ విమర్శించారు.

మరిన్ని వార్తలు