Puneeth Rajkumar: పునీత్‌ రాజ్‌కుమార్‌ రెండో వర్థంతి.. కన్నీరు పెడుతున్న ఫ్యాన్స్‌

29 Oct, 2023 11:57 IST|Sakshi

కన్నడ సినిమా యువరాజు, పవర్ స్టార్, కర్ణాటక రత్న పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం చెంది నేటికి రెండేళ్లు. నేటికీ కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో ఆయన సజీవంగానే ఉన్నాడు. సినీ ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంతో పాటు సామాజిక సేవలో కూడా అప్పూ నిమగ్నమయ్యాడు. అందుకే నేటికీ ఆయన అభిమానుల మదిలో మరపురాని జ్ఞాపకం. కంఠీర స్టూడియోలోని అప్పు స్మారకాన్ని పూలతో అలంకరించారు.

సంస్మరణ సభకు సన్నాహాలు
కంఠీరవ స్టూడియోలోని ఆయన సమాధి దగ్గర శనివారం అప్పు సంస్మరణ సభకు సన్నాహాలు చేశారు. ఈ సమాధిని పునీత్‌ రాజ్ కుటుంబం నిర్మించింది. పునీత్ రాజ్‌కుమార్ సమాధిని తెల్లటి పాలరాతితో నిర్మించారు. దానిపై పునీత్ ఫోటో పెట్టారు. సమాధి చుట్టూ ఉన్న ప్రాంతం తెల్లటి రాతి పలకతో కప్పబడి ఉంటుంది. తన తండ్రి స్మారకం మాదిరిగానే పుత్ర స్మారకం కూడా ఏర్పాటు చేశారు. నేడు ఆయన సతీమణి అశ్విని పునీత్ రాజ్‌కుమార్, పిల్లలు సమాధి దగ్గరకు వచ్చి పూజలు చేశారు. వారితో పాటుగా  శివరాజ్‌ కుమార్‌ కూడా దగ్గరుండి ఆ ఏర్పాట్లన్నీ చూసుకుంటున్నాడు. అక్కడకు భారీగా ఆయన అభిమానులు తరలి వచ్చారు.

క్యూలో నిల్చున్న అభిమానులు
డాక్టర్ రాజ్‌కుమార్, పార్వతమ్మ, పునీత్ రాజ్‌కుమార్ సమాధులను రకరకాల పూలతో అలంకరించారు. పూజలు చేసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో సమాధి వద్దకు తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే క్యూలో నిలబడి నివాళీలు అర్పిస్తున్నారు. అప్పా (నాన్న) ఎప్పటికీ మా గుండెల్లో ఉంటాడని వారు నినాదాలు చేస్తున్నారు. పునీత్‌  మరణం తర్వాత జూ. ఎన్టీఆర్‌ మాట్లాడిన మాటాలను తాజాగా ఆయన ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. 

అభిమానులకు అన్నదాన ఏర్పాట్లు
పునీత్‌  సమాధి దర్శనానికి వచ్చే అభిమానులకు అన్నదానం ఏర్పాట్లు చేశారు. సుమారు లక్ష మందికి పులావ్, పెరుగు, కుంకుమపువ్వు పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేశారు.  20 మందితో కూడిన బృందం వంట చేస్తోంది. రోజంతా అన్నదానం ఏర్పాటు చేస్తారు. ఈ ఏర్పాట్లను శివరాజ్‌ కుమార్‌ ఏర్పాటు చేశాడు.

పునీత్‌ రాజ్‌కుమార్‌ 45 ఉచిత పాఠశాలలను ఏర్పాటు చేసి 1800 మంది విద్యార్థుల‌కు చ‌దువు చెప్పించ‌డం, 26 అనాథ ఆశ్ర‌మాలు, 16 వృద్ధుల ఆశ్ర‌మాలు, 19 గోశాల‌లు ఏర్పాటు చేశాడు. అవి ఇప్పటికీ ఆయన భార్య అశ్విని పునీత్ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి.

పునీత్‌ రాజ్‌కుమార్‌ 2021 అక్టోబరు 29న వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బెంగళూరులోని విక్రమ్‌ ఆసుపత్రికి తరలించిగా చికిత్స పొందుతూ మరణించాడు. ఆయనకు భార్య అశ్వనీ రేవంత్, ఇద్దరు కుమార్తెలు ధ్రితి, వందిత ఉన్నారు. ఆయన మరణానంతరం మైసూరు విశ్వవిద్యాలయం  గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది.  కర్ణాటక గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ చేతులమీదుగా ఆయన సతీమణి అశ్విని 2022 మార్చి 22న డాక్టరేట్‌ స్వీకరించింది.

మరిన్ని వార్తలు