సినిమాని పాటలు డామినేట్‌ చేస్తున్నట్లుగా చూడొద్దు

19 Mar, 2021 00:52 IST|Sakshi
శ్రీమణి

‘‘ఒకే ఆల్బమ్‌లో ఒకదానికొకటి భిన్నంగా అనిపించే పాటలు ఉండటం అరుదు. దేవిశ్రీ ప్రసాద్‌ తన ఆల్బమ్‌లోని పాటలన్నీ డిఫరెంట్‌ వేరియేషన్స్‌తో ఉండేందుకు ప్రయత్నిస్తారు. ‘రంగ్‌ దే’ ఆల్బమ్‌ అలాంటిదే’’ అని పాటల రచయిత శ్రీమణి అన్నారు. నితిన్, కీర్తీ సురేష్‌ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగ్‌ దే’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ చిత్రంలోని నాలుగు పాటలు రాసిన శ్రీమణి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘100% లవ్‌’ సినిమాతో దేవిశ్రీతో నా ప్రయాణం మొదలైంది. ఈ ఏప్రిల్‌తో మా ప్రయాణానికి పదేళ్లు పూర్తవుతాయి.

‘తొలిప్రేమ’ చిత్రం నుంచే వెంకీ అట్లూరితో కలిసి పనిచేస్తున్నాను. సాధారణంగా మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఇచ్చే ట్యూన్స్‌కే మేం లిరిక్స్‌ రాస్తుంటాం. ఒక్కోసారి కాన్సెప్ట్‌కు తగ్గ లిరిక్స్‌ రాసుకొని, ఆ తర్వాత ట్యూన్స్‌ కట్టడం జరుగుతుంది. ప్రతి పాటనూ ఓ ఛాలెంజ్‌గానే తీసుకుంటాను. నేను రాసే పాటని మొదట నా భార్యకు లేదంటే నా ఫ్రెండ్‌ మురళికి, రైటర్‌ తోట శ్రీనివాస్‌కు వినిపిస్తుంటాను. ఫిలాసఫికల్‌ సాంగ్స్‌ని మాత్రం సీతారామశాస్త్రిగారికి వినిపించి, సలహాలు తీసుకుంటుంటాను. ‘జులాయి’ నుంచే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ చిత్రాలకు పాటలు రాస్తున్నాను. సినిమా విడుదలకు ముందే పాటలు హిట్టయితే, సినిమాని పాటలు డామినేట్‌ చేస్తున్నట్లుగా చూడకూడదు. లవ్‌ స్టోరీకి పాటలు పాపులర్‌ అయితే కమర్షియల్‌గా అది సినిమాకు ఎంతో ఉపయోగపడుతుంది’’ అన్నారు. 

మరిన్ని వార్తలు