నా కల నెరవేరింది

28 Sep, 2022 00:38 IST|Sakshi
సత్యదేవ్‌

– సత్యదేవ్‌

‘‘నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అన్నయ్యకి(చిరంజీవి) నేను పెద్ద అభిమానిని. ఆయన స్ఫూర్తితో నటుడు కావాలని కలలుకని, అయ్యాను. నా నటనని అన్నయ్య ప్రశంసించడం మాటల్లో వర్ణించలేని గొప్ప అనుభూతి. ఆయనతో నటించాలనే నా ఇన్నేళ్ల కల ‘గాడ్‌ఫాదర్‌’ చిత్రంతో నేరవేరింది’’ అని హీరో సత్యదేవ్‌ అన్నారు. చిరంజీవి హీరోగా మోహన్‌ రాజా దర్శకత్వం వహించిన  చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’. హీరో సల్మాన్‌ ఖాన్, హీరోయిన్‌ నయనతార, సత్యదేవ్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్‌బీ చౌదరి, ఎన్‌వీ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్‌ 5న తెలుగు, హిందీలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర చేసిన సత్యదేవ్‌ పంచుకున్న విశేషాలు...

► అన్నయ్య(చిరంజీవి) ఒక షూటింగ్‌లో లంచ్‌కి రమ్మని పిలిస్తే వెళ్లాను. ఒక సినిమా(గాడ్‌ఫాదర్‌) ఉందని కథ చెప్పడం మొదలుపెట్టారు. నేను ఆయనకి వీరాభిమానిని.. గురువుగా భావించిన వ్యక్తి ఆయన. అలాంటిది ఆయన నాకు కథ, నా పాత్ర గురించి చెప్పడం ఆశ్చర్యమనిపించింది.. వెంటనే చేస్తాను అని చెప్పా. ఆ క్షణం చాలా గొప్పగా అనిపించింది. అయితే ఆ పాత్ర చేస్తున్నపుడు అందులోని లోతు అర్థమైంది.. అప్పుడు చిన్న టెన్షన్‌ మొదలైంది. కానీ, అన్నయ్యగారు నటుడిగా నాపై పెట్టిన బాధ్యత ముందు భయాలు తొలగిపోయాయి. గతంలో ఎప్పుడూ చేయని పాత్ర ఈ సినిమాలో చేశా.

► అన్నయ్య గ్రేస్, ఆరాకి వంద శాతం సరిపడే కథ ‘గాడ్‌ఫాదర్‌’. చిరంజీవిగారిని మెగాస్టార్‌ అని ఎందుకు అంటారో ఆయనతో పనిచేస్తున్నప్పుడు అర్థమైంది. ఆయన చాలా క్రమశిక్షణగా, మా కంటే చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు. ప్రతి డైలాగ్‌ నేర్చుకుంటూ తర్వాతి సన్నివేశం గురించి ఆలోచించడం గ్రేట్‌.

► సల్మాన్‌ఖాన్‌గారు సెట్స్‌లో చాలా సింపుల్‌గా, సరదాగా ఉంటారు. దర్శకుడు మోహన్‌ రాజాగారు నా పాత్రని చాలా స్టయిలిష్, పవర్‌ హంగ్రీ, గ్రీడీ.. ఇలా చాలా పవర్‌ ఫుల్‌గా డిజైన్‌ చేశారు. అందరిలానే సోలో హీరోగా చేయాలనే ఉంటుంది. అయితే మంచి పాత్ర వస్తే క్యారెక్టర్స్‌ కూడా చేస్తాను.

► అన్ని భాషల్లో సినిమాలు చేయాలని ఉంది. తన సినిమాలతో సౌత్, నార్త్‌ అనే బౌండరీలు లేకుండా ఇండియన్‌ సినిమా అనేలా చేసిన రాజమౌళిగారికి హ్యాట్సాఫ్‌. నేను నటించిన ‘గుర్తుందా శీతాకాలం, కృష్ణమ్మ, రామ్‌ సేతు’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ‘ఫుల్‌ బాటిల్‌’ మూవీ పోస్ట్‌ ప్రొడక్షన్‌లో ఉంది. ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వంలో డాలీ ధనుంజయతో కలసి ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌ చేయబోతున్నాను. 

మరిన్ని వార్తలు