సృజన: తెలుగింటి బార్బీ

28 Sep, 2022 01:04 IST|Sakshi

పట్టులంగా, ఓణీ కట్టిన బొమ్మలు కాళ్లకు పారాణి, నుదుటన బాసికం కట్టిన బొమ్మలు, పసుపు కొట్టే బొమ్మలు.. పందిట్లో బొమ్మలు, అమ్మవారి బొమ్మలు, అబ్బురపరిచే బొమ్మలు.. చిందేసే బొమ్మలు.. చిదిమి దీపం పెట్టుకోవచ్చు అనిపించే బొమ్మలు ..,ఎవ్వరి చూపులనైనా కట్టిపడేసేలా ఉండే బొమ్మలేవీ అంటే.. అవి దివ్య తేజస్వి చేతుల్లో రూపుదిద్దుకున్న అందమైన బొమ్మలై ఉంటాయి.

వెస్ట్రన్‌ బార్బీ డాల్‌ను ఇండియన్‌ డాల్‌గా మార్చేసి, వాటిని మన సంప్రదాయ వేడుకలకు అనువుగా మార్చేసింది హైదరాబాద్‌ ఎఎస్‌రావు నగర్‌కు చెందిన దివ్య తేజస్వి. అమ్మాయి పుట్టుక నుంచి షష్టిపూర్తి వరకు ప్రతి వేడుకను బొమ్మల్లో అందంగానూ, అర్థవంతంగానూ చూపుతూ పది మందికి ఉపాధి కల్పిస్తోంది. భర్త ఉద్యోగరీత్యా బెంగుళూరులో ఉంటున్న దివ్య ఈ అందమైన బొమ్మల రూప కల్పన గురించి అడిగితే ఒక చిన్న ఆలోచన తన జీవితాన్ని ఎలా నిలబెట్టిందో, పదిమందికి ఆదాయవనరుగా ఎలా మారిందో నవ్వుతూ వివరించింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...

‘‘దసరా వచ్చిందంటే బొమ్మల కొలువు గురించి ఆలోచన చేయకుండా ఉండరు. అలాగే, ఒక బొమ్మనైనా ఇంటికి తెచ్చుకుంటారు. నేను ఇంట్లోనే బొమ్మల తయారీ మొదలుపెట్టాను.


పాప ముచ్చట తీర్చిన బొమ్మ
అమ్మానాన్నలది వెస్ట్‌ గోదావరి. నాన్న ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. బయోకెమిస్ట్రీ చేశాను. జూనియర్‌ లెక్చరర్‌గా ఉద్యోగం చేసేదాన్ని. పెళ్లయ్యాక మా వారి ఉద్యోగరీత్యా బెంగుళూరు వెళ్లాను. అక్కడ టీచర్‌గా ఉద్యోగంలో చేరాను. మాకు ఓ పాప. హ్యాపీగా గడిచిపోతున్నాయి రోజులు అనుకున్న సమయంలో కరోనా మా జీవితాలను దెబ్బతీసింది. మా ఉద్యోగాలు పోయాయి. అద్దె కట్టడానికి కూడా కష్టంగా ఉన్న రోజులు. ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను. ఓరోజు మా పాప తన బొమ్మకి డ్రెస్‌ వేసివ్వమంటే, నా చీర అంచుతో చీరకట్టి, అలంకరించి ఇచ్చాను. దాన్ని ఫొటో తీసి ఇన్‌స్టా పేజీలో పెట్టాను.

ఆర్డర్లు తెచ్చిన బొమ్మలు
నేను పెట్టిన బొమ్మ ఫొటో నచ్చి అమెరికా నుంచి ఒక ఎన్‌ఆర్‌ఐ ఫోన్‌ చేశారు. ‘నాకు ఆ బొమ్మ చాలా నచ్చింది. మా అమ్మాయి ఓణీ ఫంక్షన్‌ ఉంది. వచ్చినవారికి రిటన్‌గిఫ్ట్‌ ఇవ్వాలి. నాకు అలాంటి బొమ్మలు ఒక పదిహేను కావాలి. చేసిస్తారా..’ అంది. నాకు ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా వేసింది.  ఆ నెల రెంట్‌ ఇవ్వకుండా ఓనర్‌తో మాట్లాడి, ఆ డబ్బుతో బార్బీ బొమ్మలు, వాటికి కావల్సిన మెటీరియల్‌ తీసుకొచ్చాను. వ్యాపారం అనుకోలేదు. కానీ, ముందు గణేషుడి బొమ్మ తయారు చేశాను.

ఆ ముద్దు వినాయకుడిని చూసి ఆ రోజు కళ్లలో నీళ్లు వచ్చేశాయి. ఇక వెస్ట్రన్‌ కల్చర్‌తో ఉండే బార్బీ బొమ్మను తెలుగింటి సంప్రదాయం అద్దుకునేలా తయారు చేయడానికి చాలా ప్రయోగాలే చేయాల్సి వచ్చింది. జుట్టు రంగు, స్కిన్‌కలర్, కళ్లు.. వీటితో పాటు డ్రెస్సింగ్‌.. చాలా సమయమే తీసుకుంది. కానీ, ఒక్కో బొమ్మ తయారు చేసి, అనుకున్న సమయానికి పంపాను. ఆ ఆర్డర్‌ తర్వాత మరో ఆర్డర్‌ వచ్చింది. అలా వచ్చిన డబ్బుతో ఇంటి అద్దె కట్టాం.

సందర్భానికి తగిన కానుకలు
మా అమ్మనాన్నలకు నేను, చెల్లి సంతానం. మా చిన్నప్పుడు మేం ఆడుకోవడానికి మా అమ్మ క్లాత్‌తో బొమ్మలు కుట్టి, చీరలు కట్టి, వాటికి పూసలతో అలంకారం చేసేది. నాకు అదంతా గుర్తుకువచ్చింది. మన సంప్రదాయాల్లో ఎన్నో పండగలు ఉన్నాయి. వాటిని ఉదాహరిస్తూ బొమ్మలు తయారు చేసేదాన్ని. మొదట్లో అంతగా గుర్తింపు లేదు కానీ మెల్ల మెల్లగా గుర్తింపు రావడం మొదలైంది.  

పుట్టుక నుంచి షష్టిపూర్తి వరకు
అమ్మాయి పుట్టిన నాటి నుంచి ప్రతీది వేడుకలాగే సాగుతుంది ఆమె జీవితం. ఒక ఆర్డర్‌ అయితే వాళ్లమ్మాయి మొదటి రోజు స్కూల్‌కి వెళుతోంది, ఆ రోజును పురస్కరించుకుని బొమ్మ కావాలని అడిగారు. ఉయ్యాల నుంచి విద్యాభ్యాసం, ఓణీ ఫంక్షన్, పెళ్లి, సీమంతం, గృహప్రవేశం, షష్టిపూర్తి ... వరకు ఇలా ప్రతి దశలోనూ జరిగే వేడుక సందర్భాన్ని తీసుకొని, దానికి అనుగుణంగా బొమ్మల సెట్స్‌ను తయారుచేయడం ప్రారంభించాను. ఆర్డర్లు పెరుగుతున్నాయి. నాతోపాటు నాకు తెలిసిన స్నేహితులు జత కలిశారు.

ఆర్డర్లు పెరుగుతున్న కొద్దీ వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఒకరు డ్రెస్‌ కుడతారు, మరొకరు హెయిర్‌ బ్లాక్‌గా రావడానికి, ఇండియన్‌ స్కిన్‌ కలర్‌కి తేవడానికి, కళ్లు డిజైన్‌ చేయడానికి కష్టపడతారు. మొదట్లో నాకు ఒక్క బొమ్మ చేయడానికి రోజు మొత్తం పట్టేది. ఇప్పుడు 2–3 గంటలు పడుతుంది. నేను చేసిన విధానం నేర్పించి, నా పనిలోకి తీసుకున్నవారిలో కాలేజీ అమ్మాయిలు, గృహిణిలు ఉన్నారు. వాళ్ల ఇంటి వద్దే వర్క్‌ చేసిచ్చేవారున్నారు.

హైదరాబాద్‌లో ఉన్న మా అమ్మ, చెల్లెలు కూడా ఈ బొమ్మల తయారీలో భాగమయ్యారు. మా అమ్మ, మా చెల్లెలు బొమ్మలకు జడలు, పువ్వులు కుట్టి, పంపుతారు. మా వారు షాపింగ్‌ చేసుకొస్తారు. ఆన్‌లైన్‌లో చూసి, నేర్చుకోవడానికి వచ్చిన అమ్మాయిలు అలంకరణలో మార్పులు చేర్పులు, ప్యాకింగ్‌లో సాయం చేస్తుంటారు. మా చెల్లెలు ‘లలిత డాల్స్‌’ అనే పేరుతో ఉన్న ఇన్‌స్టా పేజీలో  ఫొటోలన్నీ అప్‌లోడ్‌ చేస్తూ ఉంటుంది. ఇలా కొందరి చేయూతతో నా బొమ్మలు మరింత అందంగా రూపుకడుతున్నాయి.

బడ్జెట్‌కు తగినట్టు..
ఒక బొమ్మ రూ. 200 నుంచి ధర ఉంది. వెడ్డింగ్‌ సెట్‌ అయితే రూ. 15000 వరకు ఉంటుంది. తక్కువ ధరలో సెట్‌ కావాలంటే అందుకు తగినట్టు కస్టమైజ్‌ చేసి ఇస్తున్నాను. ఇది దసరా సమయం కాబట్టి, అమ్మవారి బొమ్మలు, బతుకమ్మ ఆడుతున్న మహిళల బొమ్మల సెట్‌.. తయారుచేశాను. హైదరాబాద్‌లోని ఎఎస్‌రావునగర్‌లో ఇప్పుడు ఎగ్జిబిషన్‌ పెట్టాం. అమ్మాయి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలతో పాటు పౌరాణిక గాధలు కూడా ఈ బొమ్మల ద్వారా చూపుతున్నాను’’ అని వివరించింది ఈ కళాకారిణి.

– నిర్మలారెడ్డి

మరిన్ని వార్తలు