సినిమా కలకాలం నిలుస్తుంది – రమేశ్‌ ప్రసాద్‌

26 Jul, 2022 02:44 IST|Sakshi

‘‘మా నాన్నగారు (దర్శక–నిర్మాత ఎల్వీ ప్రసాద్‌) మూకీ సినిమా అప్పటినుంచి సినిమాల్లో భాగమయ్యారు. ఆ విధంగా మా ప్రసాద్స్‌ సంస్థకి సినిమాతో ఎంతో అనుబంధం ఉంది. ఇప్పుడు ఈ కరోనా కాలంలో సినిమా గడ్డు పరిస్థితి ఎదుర్కొనడం చూశాం. ప్రేక్షకుల ప్రేమతో ఇండస్ట్రీ ఈ కష్టకాలాన్ని అధిగమించింది. సినిమా కలకాలం నిలుస్తుంది. ‘సీతారామం’ టీమ్‌కి శుభాకాంక్షలు’’ అని ప్రసాద్స్‌ గ్రూప్‌ అధినేత రమేశ్‌ ప్రసాద్‌ అన్నారు.

దుల్కర్‌ సల్మాన్, మృణాల్‌ ఠాకూర్‌ హీరో హీరోయిన్లుగా వైజయంతీ మూవీస్‌ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్‌ నిర్మించిన చిత్రం ‘సీతారామం’. ఇందులో రష్మికా మందన్నా, సుమంత్‌ కీలక పాత్రలు చేశారు. 1965, 80 నేపథ్యంలో సాగే ప్రేమకథగా హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. సోమవారం జరిగిన ఈ చిత్రం ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో రమేశ్‌ ప్రసాద్‌ అతిథిగా పాల్గొన్నారు. ఆగస్ట్‌ 5న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్‌     కానుంది.

దుల్కర్‌ సల్మాన్‌ మాట్లాడుతూ – ‘‘అందరూ నన్ను రొమాంటిక్‌ హీరో అంటుంటే విసుగొచ్చి ఇక ప్రేమకథలు చేయకూడదనుకున్నాను. హనుగారు చెప్పిన ‘సీతారామం’ అద్భుతమైన ప్రేమకథ. క్లాసిక్‌ ఎపిక్‌ లవ్‌ స్టోరీ కాబట్టి చేశాను’’ అన్నారు. ‘‘ఇందులో నేను చేసిన అఫ్రిన్‌ పాత్ర రెబల్‌. నా పాత్ర పై ఆడియన్స్‌కి కోపం వచ్చినా ఆ పాత్ర తాలూకు ఎమోషన్స్‌తో కనెక్ట్‌ అయితే నేను విన్నర్‌ అయినట్లే’’ అన్నారు రష్మికా మందన్నా. ‘‘ఈ చిత్రంలో మ్యాజికల్‌ రొమాన్స్‌ వుంటుంది’’ అన్నారు మృణాల్‌  ఠాకూర్‌. సుమంత్, హను రాఘవపూడి మాట్లాడారు.
 

మరిన్ని వార్తలు