కీలక విషయాలు వెల్లడించిన సుశాంత్‌ సోదరి

2 Sep, 2020 20:30 IST|Sakshi

‘సుశాంత్‌ 2013లోనే సైక్రియాటిస్ట్‌ని కలిశాడు’

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. బిహార్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సుశాంత్‌ డిప్రెషన్‌ గురించి తమకు తెలియదంటూ అతడి కుటుంబ సభ్యులు వెల్లడించారు. కానీ సుశాంత్‌ సోదరికి, మాజీ మెనేజర్‌కి మధ్య జరిగిన వాట్సాప్‌ చాట్‌తో ఇది అబద్దమని రుజువయ్యింది. ఈ క్రమంలో సుశాంత్‌ సోదరి మీతు సింగ్‌ ముంబై పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. సుశాంత్‌​ సింగ్‌ లోగా ఫీలయ్యేవాడని.. ఈ క్రమంలో 2013లోనే తను సైక్రియాటిస్ట్‌ని‌ కలిశాడని తెలిపారు. మీతు సింగ్‌, సుశాంత్‌ చనిపోవడానికి రెండు రోజుల ముందు వరకు తనతోనే ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘2019, అక్టోబర్‌లో సుశాంత్‌ తను చాలా లోగా ఫీలవుతున్నట్లు మాతో చెప్పాడు. దాంతో నాతో పాటు మా సోదరి నీతు సింగ్‌, ప్రియాంక ముంబై వచ్చి తనను కలిశాము. కొద్ది రోజుల పాటు తన ప్లాట్‌లోనే ఉన్నాం. తనను ఓదార్చం. కెరియర్‌లో అప్‌ అండ్‌ డౌన్స్‌ వల్ల తను అలా ఫీలవుతున్నట్లు మాతో చెప్పాడు’ అని తెలిపారు మీతు. (చదవండి: 2019లోనే సుశాంత్‌ సోదరికి తెలుసా?)

ఆమె మాట్లాడుతూ.. ‘దాంతో నా సోదరి నీతు, సుశాంత్‌ని ఆమెతో పాటు ఢిల్లీ రమ్మంది. కానీ తను కొద్ది రోజుల తర్వాత వస్తా అన్నాడు. 2019 నవంబర్‌ నుంచి సుశాంత్‌ హిందూజ ఆస్పత్రిలో పని చేస్తున్న డాక్టర్‌ కెర్సీ చౌడా వద్ద ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నాడు. ఈ ఏడాది మార్చిలో లాక్‌డౌన్‌ విధించడంతో ఇంట్లోనే ఉంటూ పుస్తకాలు చదవడం, ఎక్సర్‌సైజ్‌, మెడిటేషన్‌, యోగా చేస్తూ ఉన్నాడు’ అన్నారు. ఇక జూన్‌ 5న మీతు సింగ్‌ మరోసారి తన సోదరుడిని కలిసింది. దీని గురించి ఆమె మాట్లాడుతూ.. ‘నేను ముంబై వచ్చినప్పుడు నా సోదరుడు డల్‌గా ఉన్నట్లు అనిపించింది. ఏమైంది అని అడిగాను. లాక్‌డౌన్‌ కారణంగా ఎక్కడికి వెళ్లడానికి లేదు. ఇంట్లో ఉండి బోర్‌ కొడుతుంది అని చెప్పాడు. నన్ను కొద్ది రోజుల పాటు తనతోనే ఉండమన్నాడు. దాంతో నేను ఇక్కడే ఉండి తన కోసం వంట చేస్తూ.. కబుర్లు చెబుతూ గడిపాను. లాక్‌డౌన్‌ తర్వాత సౌత్‌ ఇండియా టూర్‌ వెళ్దామన్నాడు అని తెలిపారు మీతు సింగ్‌. (చదవండి: ఈ మందులు వాడు: సుశాంత్ సోద‌రి)

ఆమె మాట్లాడుతూ.. ‘అయితే జూన్‌ 12న నేను మా ఇంటికి వెళ్లాను. అక్కడ నా కుమార్తె ఒంటరిగా ఉంది. దాంతో వెళ్లాల్సి వచ్చింది. నేను వెళ్లాక తనకు కాల్‌ చేశాను. మెసేజ్‌ చేశాను రిప్లై లేదు. తను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో మాకు అర్థం కావడం లేదు’ అన్నారు. ఇక మరో సోదరి ప్రియాంక కూడా ఇదే విషయలను వెల్లడించారు. తల్లి చనిపోయిన దగ్గర నుంచి సుశాంత్‌ చాలా విచారంగా ఉండేవాడని నీతు సింగ్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు