మూడేళ్లు పూర్తి చేసుకున్న ‘మెర్సల్‌’

19 Oct, 2020 08:38 IST|Sakshi
కేరళ ఫ్యాన్స్‌ విడుదల చేసిన ఆన్‌లైన్‌ పోస్టర్‌

చెన్నై : దళపతి విజయ్‌, సమంతా అక్కినేని, కాజల్‌ అగర్వాల్‌, నిత్యామీనన్‌ ప్రధాన పాత్రల్లో కలిసి నటించిన చిత్రం ‘మెర్సల్‌’. హిట్‌ సినిమాల దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2017 అక్టోబర్‌ 18న తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే తేదీన తెలుగులో ’అదిరింది’గా విడుదలైంది. ఈ సినిమా నిన్నటితో మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అయితే అంతకు కొద్దిరోజుల ముందు నుంచే దేశ వ్యాప్తంగా ఉన్న దళపతి ఫ్యాన్స్‌ హంగామా మొదలైంది. పలు పోస్టర్లతో, సినిమాలోని తమకు నచ్చిన సీన్ల వీడియోలను షేర్‌ చేసుకుంటూ సోషల్‌మీడియాలో హడావుడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో #3YearsOfMegaBBMersal తో ఓ హ్యాస్‌ ట్యాగ్‌ ట్విటర్‌లో వైరల్‌గా మారింది. ( వరలక్ష్మీ దాగుడుమూతలు )

కాగా, రజనీ తర్వాత అంతటి మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న విజయ్‌ రాజకీయ రంగ ప్రవేశంపై గత కొన్ని నెలలుగా అభిమానులు చేస్తున్న ప్రచారం రాజకీయ రంగాల్లో కలకలం రేపుతోంది. జూన్‌ 22న విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా అన్నాదురై, పెరియార్‌లతో విజయ్‌ ఫొటోలను ముద్రించిన పోస్టర్లను అభిమానులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో మీరు రాజకీయాల్లోకి వస్తే అన్నాదురై లేకుంటే పెరియార్‌ అంటూ పేర్కొన్నారు. ఆ తర్వాత నటుడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ నటించిన చిత్రాల్లోని ఆయన గెటప్‌లలో విజయ్‌ ముఖాలను పొందుపరిచిన పోస్టర్లు కాంచీపురంలో హల్‌చల్‌ చేశాయి. అందులో నాడొడి మన్నన్‌ మాట్టుక్కార వేలన్, కుడియిరుంద, కోయిల్‌ చిత్రంలోని ఎంజీ రామచంద్రన్‌ గెటప్పుల్లో విజయ్‌ ముఖాన్ని పొందుపరిచారు. ఆ పోస్టర్‌లో మక్కల్‌ తిలకంకు మరో రూపమే అంటూ పేర్కొన్నారు. 2021 ప్రథమార్థంలో తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పోస్టర్లూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.  

మరిన్ని వార్తలు