నోటీసులిచ్చారు.. చర్యలు మరిచారు!

28 Jun, 2023 02:22 IST|Sakshi
చండూరు పట్టణంలో ప్రధాన సెంటర్‌

చండూరు మున్సిపాలిటీలో జోరుగా అక్రమ నిర్మాణాలు

ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు

పేదలకే వర్తిస్తున్న నిబంధనలు

చండూరు పట్టణంలో కేంద్రంలో అనుమతి లేకుండా ఓ భవన నిర్మాణం చేపట్టారు. దీనిపై మున్సిపల్‌ అధికారులకు ఓ నాయకుడు ఫిర్యాదు చేశాడు. అధికారులు నిర్మాణదారుడికి ముందుగా నోటీసులు ఇచ్చారు. చర్యలు తీసుకుంటామని చెప్పే లోపే (ఏడాది సమయంలో) ఆ భవన నిర్మాణం పూర్తయింది.

పట్టణంలో ఓ వ్యక్తి అనుమతి లేకుండా మూడు ప్లోర్‌ల ఇంటి నిర్మాణం చేపట్టాడు. అక్రమ నిర్మాణం చేపడుతున్నారని కౌన్సిలర్లు అధికారులకు అనేక సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.

ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరి గోడ ముందు అనుమతి లేకుండా రెండు విగ్రహాలు ఏ్పాటు చేస్తున్నారని పట్టణ వాసులు అధికారులకు ఫిర్యాదు చేశారు. వారికి అధికారులు నోటీసులు ఇచ్చి వదిలేశారు.

చండూరు : చండూరు మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు అడ్డూ అదుపు లేకుండా సాగుతున్నాయి. పట్టణంలోని సెంటర్‌ నుంచి రోడ్డుకు ఇరువైపులా వ్యాపార సముదాయాలు మొదలుకుని పెద్ద భవనాలు, ఆస్పత్రులు, ఫంక్షన్‌ హాళ్లు ఇలా చాలా వరకు అనుమతి లేని నిర్మాణాలే. అక్రమ నిర్మాణం చేసుకునే వారికి నోటీలిస్తున్న అధికారులు వారిపై చర్యలకు మాత్రం వెనుకాడుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలో పలుకుబడి ఉన్న వారు యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేసుకుంటూ ముందుకు సాగుతుంటే.. పేదలకు మాత్రం అనుమతులు అడుగుతూ అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

100 వరకు అక్రమ నిర్మాణాలు..
చండూరు మున్సిపాలిటీ పరిధిలో సుమారు 100 ఇళ్ల వరకు అనుమతిలేనివిగా అధికారులు గుర్తించా రు. వీరికి గతంలో నోటీసులు సైతం అందజేసి.. చ ర్యలు తీసుకోవడం మరిచారు. అధికారులు గుర్తించనవి మరో వంద వరకు ఉంటాయని కౌన్సిలర్లే చెప్తున్నారు. అధికారులు నోటీసులు ఇవ్వడం తప్ప చర్యలు తీసుకోకపోవడంతో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని పట్టణవాసులు అంటున్నారు.

టాస్క్‌ఫోర్స్‌కు ఫిర్యాదు చేస్తున్నాం
చండూరు మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలను గుర్తించి, వాటి యజమానులకు నోటీసులు అందించాం. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై తదుపరి చర్యలకు జిల్లా టాస్క్‌ఫోర్స్‌కు రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నాం. అక్రమ నిర్మాణాలపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
– మొయిజుద్దీన్‌, కమిషనర్‌, చండూరు మున్సిపాలిటీ

నిబంధనలు ఇలా..
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అత్యంత సౌకర్యవంతంగా, సులభంగా నిర్మాణ అనుమతులు ఇవ్వడం కోసం బీఎస్‌ బీపాస్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో ముందుగా అనుమతి కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. ఆ తర్వాత రెవెన్యూ ఆర్‌ఐ లాగిన్‌ వెళ్తే ఆర్‌ఐ క్షేత్రస్థాయిలో విచారణ చేసి టౌన్‌ ప్లానింగ్‌ సెక్షన్‌ (టీపీఎస్‌)కు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అన్ని రకాల డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటే టీపీఎస్‌ నుంచి నేరుగా అనుమతులు ఇస్తారు. అనుమతుల కోసం ఇంటి గజాలను బట్టి ఆన్‌లైన్‌లో నగదు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇలా అనుమతుల ప్రక్రియ పట్టణంలో సాగడం లేదు.

మరిన్ని వార్తలు