పల్లె గొంతెండకుండా..

20 Mar, 2023 02:06 IST|Sakshi
నంద్యాల మండలం చాబోలులో మంచినీటిని పట్టుకుంటున్న మహిళ

ప్రతిపాదనలు పంపించాం

ఫిబ్రవరి, మార్చి నెలల్లో అధికారులు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి బోర్లను పరిశీలించారు. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా నీటి సమస్య లేదు. మంచినీటి సమస్య తలెత్తకుండా ముందస్తుగా పనులు చేపట్టేందుకు రూ. 2.89 కోట్లతో ప్రతిపాదనలు పంపాం. నీటి ఎద్దడి తలెత్తే గ్రామీణ ప్రజలు హెల్ప్‌లైన్‌ను సద్వినియోగం చేసుకుని సమస్యను పరిష్కరించుకోవాలి.

– మనోహర్‌, జిల్లా గ్రామీణ నీటిపారుదలశాఖ అధికారి, నంద్యాల

నంద్యాల(రూరల్‌): వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా జిల్లా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. జిల్లా పరిషత్‌, పంచాయతీరాజ్‌ శాఖలతో గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు సమన్వయం చేసుకొని నీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ఏడాది జూన్‌ వరకు ఎలాంటి సమస్య రాకుండా ముందుగానే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. వెంటనే మంచినీటి పథకాల మరమ్మతులు, పూడికతీత పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఈ వేసవిలో జిల్లా వ్యాప్తంగా బేతంచెర్ల, ప్యాపిలి, డోన్‌, సంజామల, బనగానపల్లె, అవుకు, కొలిమిగుండ్ల, గడివేముల, పాణ్యం, నందికొట్కూరు, మిడుతూరు, బండిఆత్మకూరు, వెలుగోడు, మహానంది తదితర మండలాల పరిధిలోని 134 గ్రామాల్లో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో నీటి ఎద్దడి నివారణకు రూ.2.89 కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు పంపించారు. గతంతో పోల్చితే జిల్లాలో ఈ వేసవిలో నీటి ఎద్దడి తీవ్రత తక్కువగా ఉండే అవకాశం ఉంది. గతేడాది వేసవి లో జిల్లాలో 21 మండలాల్లో 189 గ్రామాల్లో నీటి సమస్య ఏర్పడింది. కాగా గతేడాది వర్షాకాలంలో జిల్లాలో భారీ వర్షాలు కురవడంతోపాటు రిజర్వాయర్లు, నదులు, చెరువులు, వాగుల్లో నీరు సమృద్ధిగా ఉండటంతో భూగర్భ జలాలు బాగా పెరిగా యి. దీతో గతంలో మాదిరిగా గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటిని ట్యాంకర్లతో సరఫరా చేసే పరిస్థితి ఉండదని అధికారులు అంచనా వేస్తున్నారు.

నీటి సమస్యల ఫిర్యాదుకు హెల్ప్‌లైన్‌..

వేసవి నేపథ్యంలో ఏదైనా గ్రామాల్లో తలెత్తే మంచినీటి సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ (హెల్ప్‌డెస్క్‌) ఏర్పాటు చేసి, సిబ్బందిని నియమించారు. జిల్లాలో ఎక్కడైనా నీటి ఎద్దడి ఏర్పడితే 08514–244424కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేస్తే సమీప ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకొని నీటి సమస్యను పరిష్కరిస్తారు. ఆయా కార్యాలయాల్లో సిబ్బంది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటారు. రాష్ట్రంలో జరుగుతున్న జలజీవన్‌ మిషన్‌ పథకం పనులను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర కమిటీ సభ్యులు జిల్లాలోని ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌ డెస్క్‌ను శుక్రవారం పరిశీలించి ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను అభినందించారు.

వేసవిలో నీటిఎద్దడి నివారణకు

ముందస్తు చర్యలు

15 మండలాలపై ప్రత్యేక దృష్టి

134 గ్రామాల్లో 283 పనులు గుర్తింపు

రూ.2.89 కోట్లతో ప్రతిపాదనలు

పంపిన ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు

మరిన్ని వార్తలు