నేడు స్పందన | Sakshi
Sakshi News home page

నేడు స్పందన

Published Mon, Mar 20 2023 2:06 AM

- - Sakshi

నంద్యాల: స్థానిక వైఎస్సార్‌ సెంటినరీ హాల్‌లో సోమవారం స్పందన కార్యక్రమం ఉంటుందని జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ శామూన్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరించే ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులందరూ హాజరు కావాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్‌, నియోజకవర్గ, మండల స్థాయిల్లో కూడా యథాతథంగా స్పందన కార్యక్రమం ఉంటుందన్నారు.

పోలీసు స్పందన రద్దు

బొమ్మలసత్రం: నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ కె.రఘువీర్‌రెడ్డి ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఉగాది ఉత్సవాల నేపథ్యంలో పోలీసు అధికారులు బందోబస్తు విధుల్లో ఉండటంతో స్పందనను తాత్కాలికంగా రద్దు చేస్తున్నామన్నారు. వచ్చే సోమవారం యథావిధిగా నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.

కన్నడ భక్తులకు

ఏలోటు రానివ్వం

ఈఓ లవన్న

శ్రీశైలంటెంపుల్‌: ఉగాది మహోత్సవాలను పురస్కరించుకుని కర్ణాటక, మహారాష్ట్రల నుంచి తరలివచ్చిన కన్నడ భక్తులకు ఏలోటు రానివ్వకుండా అన్ని ఏర్పాట్లు చేశామని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎస్‌.లవన్న తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతేడాది చోటు చేసుకున్న సంఘటనలు పునరావృతం కాకుండా ఉత్సవాలకు పది రోజుల ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. అలాగే శ్రీశైల జగద్గురు పీఠాధిపతి డాక్టర్‌ చెన్నసిద్దరామ శివాచార్య మహాస్వామి వారిచే కన్నడ భక్త భృందాలకు, భక్తులకు ఉత్సవాల నిర్వహణపై సందేశం ఇచ్చారన్నారు. రద్దీ దృష్ట్యా ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం కల్పిస్తున్నామని తెలిపారు. ఏపీ పోలీసులతో పాటు, కర్ణాటక నుంచి 300 మంది పోలీసులు ఉత్సవాల విధులు నిర్వహిస్తున్నారన్నారు. కర్ణాటక, మహా రాష్ట్రాల నుంచి 800 మంది స్వచ్ఛంద సేవకులు కూడా విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. క్షేత్ర పరిధిలో అధిక ధరలకు చోటులేకుండా లీగల్‌ మెట్రాలజీ అధికారులతో, దేవస్థాన చీఫ్‌ సెక్యూరిటీ అధికారితో ప్రత్యేక టీంను ఏర్పాటు చేశామన్నారు.

టీబీ డ్యామ్‌కు 1,020 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

హొళగుంద: తుంగభద్ర రిజర్వాయర్‌(టీబీ డ్యాం)కు రెండు రోజులుగా ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. శనివారం ఇన్‌ఫ్లో 689 క్యూసెక్యులు ఉండగా ఆదివారం 1,020కు పెరిగింది. డ్యామ్‌లో 1,633 అడుగులకు గాను 1,594.85 అడుగులు, 105.788 టీఎంసీల పూర్తి నీటి సామర్థ్యానికి గాను 15.558 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఔట్‌ ఫ్లో 9,169 క్యూసెక్కులు ఉంది. ఎల్లెల్సీ ఆంధ్ర కాలువ ప్రారంభం 250 కి.మీ వద్ద 506 క్యూసెక్కుల ప్రవాహం ఉంది.

వచ్చే నెల చివరి వరకు

సాగు నీరు

పాణ్యం: ఎస్సార్బీసీ కాల్వ కింద సాగు చేస్తున్న రైతులకు ఏప్రిల్‌ ఆఖరు వరకు సాగు నీరు అందిస్తామని ఈఈ సుభకుమార్‌ తెలిపారు. ప్రస్తుతం గోరుకల్లు జలాశయంలో 6.02 టీఎంసీల నీరు నిల్వ ఉందని చెప్పారు. ప్రతి రోజూ ఎస్పార్బీసీ కాల్వ ద్వారా 700 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామన్నారు.

1/1

Advertisement
Advertisement