‘వరి’ంచిన దిగుబడులు | Sakshi
Sakshi News home page

‘వరి’ంచిన దిగుబడులు

Published Mon, Nov 27 2023 1:56 AM

కోవెలకుంట్ల సమీపంలో రాశిగా పోసిన వడ్లు - Sakshi

పంట బాగా పండింది

నాకున్న 2.07 ఎకరాల్లో ఈ ఏడాది కర్నూలు సోనా రకం వరిని సాగు చేశాను. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కూలీలు, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 25 వేలు వెచ్చించాను. వాతావరణం అనుకూలించి పైరు ఏపుగా పెరిగింది. పంట బాగా పండింది. ఎకరాకు 40 బస్తాల దిగుబడులు వస్తాయని భావిస్తున్నాను. – బలరాముడు, రైతు, అమడాల, కోవెలకుంట్ల మండలం

కోవెలకుంట్ల/డోన్‌ రూరల్‌: వరి రైతులకు ఈ ఏడాది అన్ని విధాలా కలిసొచ్చింది. దిగుబడులు ఆశాజనకంగా వస్తున్నాయి. మార్కెటలో గిట్టుబాటు ధర లభిస్తోంది. జిల్లాలోని 29 మండలాల పరిధిలో బోర్లు, బావులు, చెరువులు, ఎస్సార్బీసీ, కుందూనది, పాలేరు, కుందరవాగు, కేసీకెనాల్‌, తదితర సాగునీటి వనరుల ఆధారంగా ఖరీఫ్‌ సీజన్‌లో 1.03 లక్షల ఎకరాల్లో కర్నూలు, నంద్యాల సోనా, 555 రకాలకు చెందిన వరిని రైతులు సాగు చేశారు. బండిఆత్మకూరు మండలంలో అత్యధికంగా 25,000 ఎకరాలు, నందికొట్కూరు మండలంలో అత్యల్పంగా 132.5 ఎకరాల్లో సాగు చేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలను వ్యవసాయశాఖ సరఫరా చేసింది. క్షేత్రస్థాయిలో వివిధ కార్యక్రమాలు నిర్వహించి సాగులో రైతాంగానికి వ్యవసాయ శాఖ దిశానిర్దేశం చేసింది. ప్రస్తుతం వరికోత, నూర్పిడి పనుల్లో రైతుల్లో నిమగ్నమయ్యారు.

దిగుబడులు ఆశాజనకం

గత ఏడాది ఖరీఫ్‌లో వరిసాగులో మంచి దిగుబడులు వచ్చాయి. వాతావరణం అనుకూలించి ఎకరాకు 40 నుంచి 42 బస్తాల దిగుబడులు లభించాయి. ఈ ఏడాది కోటి ఆశలతో వరి సాగు చేయగా ఆశించిన స్థాయిలో దిగుబడులు వస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరినారు, నాట్లు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కలుపు, కోత, నూర్పిడి, తదతర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 25 వేల నుంచి రూ. 30 వేలు వెచ్చించారు. పైరు వివిధ దశల్లో దోమ, ఎర్ర తెగులు ఆశించగా రైతులు సకాలంలో గుర్తించి క్రిమి సంహారక మందుల పిచికారీతో తెగుళ్లు అదుపులోకి వచ్చాయి. వాతావరణం అనుకూలంగా మారి పంట పండి ఎకరాకు 40 బస్తాల దిగుబడులు వస్తున్నాయి. పెట్టుబడులు పోనూ నికర ఆదాయం చేకూరుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

క్వింటాకు రూ. 2,203 మద్దతు ధర

ఈ ఏడాది వరిసాగుకు ముందే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. గ్రేడ్‌–1 రకం క్వింటా 2,203, గ్రేడ్‌–2 రకం రూ. 2,183 ధర నిర్ణయించారు. వరికి మద్దతు ధర ఉండటంతో రైతులు విస్తారంగాసాగు చేశారు. వరిపైరు చేతికందటంతో రైతులు కోత, నూర్పిడి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కంబైండ్‌ హార్వెస్టర్‌ యంత్రాలతో వరి కోత. నూర్పిడి పనులు జరుగుతున్నాయి. ఎకరా వరి కోత, నూర్పిడికి రూ. 3వేలు ఖర్చు అవుతోంది. మార్కెట్‌లో ధర ఉండటంతో నూర్పిడి చేసిన వెంటనే వడ్లను విక్రయిస్తున్నారు. పచ్చివడ్లను బస్తా (75 కేజీలు) రూ. 1,500లకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. దిగుబడులు ఆశాజనకంగా వస్తుండటం, ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర ఉండటంతో ఆదాయం చేకూరుతుందని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

వాతావరణం అనుకూలించింది

ఈ ఏడాది వరి సాగుకు వాతావరణం అన్ని విధాలా అనుకూలంగా మారింది. పైరు రెండు నెలల దశలో దోమ పోటు, ఎర్ర తెగులు ఆశించగా రైతులకు సూచనలు, సలహాలు అందజేశాం. ఎకరాకు 40 బస్తాల దిగుబడులు వస్తున్నాయి.

– టి.మోహన్‌రావు, జిల్లా వ్యవసాయ అధికారి

కలిసొచ్చిన ఖరీఫ్‌ వరి సాగు

ఎకరాకు 40 బస్తాల దిగుబడి

ఎకరాకు రూ. 25 వేల పెట్టుబడి

క్వింటాకు రూ. 2,203 మద్దతు ధర

వడివడిగా వరి కోతలు,

నూర్పిడి పనులు

మార్కెట్‌లో మంచి ధర ఉంది

ఈ ఏడాది వరి సాగు ఆశాజనకంగా ఉంది. ఎకరాకు 40 బస్తాల వరకు దిగుబడులు వస్తున్నాయి. మార్కెట్‌లో వరికి గిట్టుబాటు ధర ఉంది. పెట్టుబడి పోను రైతుకు నికరాదాయం లభిస్తోంది. – చిరంజీవి, దొరపల్లి గ్రామం

భీమునిపాడు వద్ద కంబైండ్‌ హార్వెస్టర్‌తో 
వరి కోత పనులు
1/3

భీమునిపాడు వద్ద కంబైండ్‌ హార్వెస్టర్‌తో వరి కోత పనులు

2/3

3/3

Advertisement
Advertisement