ఆశల దీపం ఆరిపోయింది | Sakshi
Sakshi News home page

ఆశల దీపం ఆరిపోయింది

Published Wed, Nov 8 2023 2:04 AM

విద్యార్థి 
ప్రవీణ్‌(ఫైల్‌)  
 - Sakshi

● అదృశ్యమైన విద్యార్థి గని గుంతలో శవమై తేలి

కొలిమిగుండ్ల: ఆ దంపతులకు ముగ్గురు కుమార్తెల తర్వాత కలిగిన కుమారుడిని అల్లారు ముద్దుగా చూసుకున్నారు. బాగా చదివించి ప్రయోజకుడిని చేయాలని కలలుగన్నారు. అంతలోనే విషాదం చోటు చేసుకుంది. బడికి వెళ్లిన కుమారుడు ఇంటికి తిరిగి రాలేదు. రోజులు గడుస్తున్నా ఎక్కడా ఆచూకీ లభించలేదు. క్షేమంగా తిరిగి రావాలని దేవుళ్లను మొక్కారు. చివరికు వారి ఆశలు ఆవిరయ్యాయి. 13 రోజుల క్రితం అదృశ్యమైన విద్యార్థి గని గుంతలో విగతజీవిగా శవమై తేలాడు. ఈ విషాదకర సంఘటన బందార్లపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గోగుల రామచంద్ర, అరుణ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ప్రవీణ్‌(13). గ్రామానికి మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న అంకిరెడ్డిపల్లె ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. అక్టోబర్‌ 28వ తేదీన పాఠశాలకు వెళ్లిన విద్యార్థి సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబీకులు పాఠశాల పరిసర ప్రాంతాల్లో గాలించడంతో పాటు గ్రామంలోని ఇతర విద్యార్థులను ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని విషయం చెప్పడంతో పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి విద్యార్థి ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం గ్రామ సమీపంలో గని గుంతలో ఈతకెళ్లిన పిల్లలకు ప్రవీణ్‌ మృతదేహం కనిపించడంతో గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 13 రోజులు గడవడంతో మృతదేహం పూర్తిగా దెబ్బతింది. 13 రోజుల నుంచి ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు కుమారుడి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రవీణ్‌ బడి నుంచి ఇంటికి వెళ్లకుండా ఈత కొట్టేందుకు ఒక్కడే గని గుంత వద్దకు వెళ్లి నీట మునిగి ఊపిరాడక మృతి చెందినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రమేష్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థి మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం తీసుకెళ్లేందుకు వీలుపడక పోవడంతో నంద్యాల నుంచి వైద్యులను అక్కడికే పిలిపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.

Advertisement
Advertisement