Mann Ki Baat Live At UNO: మన్‌ కీ బాత్‌ @100.. ఐరాసలో ప్రసారం..

30 Apr, 2023 11:11 IST|Sakshi

రేడియో ద్వారా ప్రజలతో సంభాషిస్తూ, దేశాభివృద్ధిలో వారందరినీ భాగస్వాముల్ని చేస్తూ, దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో  ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమం తీసుకువచ్చారు. ఇక 2014 అక్టోబర్‌ 3న  తీసుకువచ్చిన ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమం విజయవంతమైంది. రాజకీయాలకు అతీతంగా దేశంలోని సామాన్యుల అసామాన్య గాథలను ఇందులో ప్రస్తావిస్తుండటం దేశ పౌరులపై లోతైన ప్రభావం చూపిందనడంలో సందేహం లేదు. ప్రధానమంత్రిగా కాకుండా.. స్నేహితుడిగా, సంరక్షకుడిగా, సన్నిహితుడిగా.. వివిధ సందర్భాల్లో, వివిధ పాత్రల్లో ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతి నెలా చివరి ఆదివారం వచ్చే ఈ కార్యక్రమం ఈ రోజు వందో ఎపిసోడ్‌ పూర్తి చేసుకోనుండటం విశేషం. 

ఇక, ఆదివారం ఆల్‌ ఇండియా రేడియోలో చేస్తున్న ‘మన్‌కీ బాత్‌’ వందో ఎపిసోడ్‌ ఆదివారం ప్రసారం కానుంది. ఈ కార్యక్రమాన్ని కోట్ల మంది ప్రజలు వినేలా బీజేపీ కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా 4 లక్షల ప్రాంతాల్లో ప్రజలు ఆలకించేందుకు చర్యలు చేపట్టింది. పార్టీ జాతీయ అధ్యక్షుడి నుంచి.. పోలింగ్‌ కేంద్రం స్థాయి నాయకుల వరకూ అంతా పాల్గొనేలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులూ వినేలా ఏర్పాట్లు చేసినట్లు పార్టీ వివరించింది. ఇక, ఇండియాలో 22 ప్రముఖ భాషలు, 29 మాండలికాలలో ప్రసారం కానుంది. మరోవైపు.. 11 విదేశీ భాషల్లో కూడా మన్‌ కీ బాత్‌ ప్రసారం కానుంది. 

అన్ని రాష్ట్రాల రాజ్‌ భవన్లు, బీజేపీ, మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రుల నివాసాల్లో వందో ఎపిసోడ్‌ను వినిపించనున్నట్లు పార్టీ పేర్కొంది. రాజ్‌ భవన్లకు ఆయా రాష్ట్రాల్లో పద్మ అవార్డులు అందుకున్న వారిని ఆహ్వానించనునట్లు వెల్లడించింది. ఇక, మన్‌ కీ బాత్‌ వందో ఎపిసోడ్‌.. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం కానుంది.

మరిన్ని వార్తలు