‘సీజే బదిలీ ప్రజా ప్రయోజనాల కోసమేనా?’

13 Nov, 2021 06:36 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  వాక్‌ స్వాతంత్య్రం, లౌకికవాదం, స్వేచ్ఛాయుతమైన ఎన్నికలు, ఆరోగ్య హక్కు, రాష్ట్ర జవాబుదారీతనంపై అనేక ఉత్తర్వులు ఇచ్చిన మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీబ్‌ బెనర్జీని ఎందుకు బదిలీ చేశారంటూ సుప్రీంకోర్టు కొలీజియంను ఆ కోర్టు లాయర్లు ప్రశ్నించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణకు లేఖ రాశారు. జస్టిస్‌ సంజీబ్‌ బెనర్జీని మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేయాలన్న కొలీజియం సిఫార్సుపై మద్రాస్‌ హైకోర్టు న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. పదవీ బాధ్యతలు చేపట్టిన 10 నెలల్లోపే బదిలీ చేయడం ప్రజా ప్రయోజనం కోసమా? లేక మెరుగైన న్యాయ నిర్వహణ కోసమా? అని తమ లేఖలో ప్రశ్నించారు. 75 మంది న్యాయమూర్తులుండే మద్రాసు హైకోర్టు నుంచి కేవలం ఇద్దరు న్యాయమూర్తులుండే మేఘాలయా హైకోర్టుకు బదిలీ చేయడం విస్తుగొలిపే ప్రశ్నలకు ఆస్కారం ఇస్తోం దని పేర్కొన్నారు. ఈ తరహా బదిలీ నిజాయితీ కలిగిన న్యాయమూర్తి ప్రతిష్టను దెబ్బతీయడంతోపాటు ప్రజల దృష్టిలో న్యాయవ్యవస్థ ప్రతిష్టను సైతం దిగజారుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు