ఆ 3 ఆర్డినెన్స్‌లు వ్యవసాయానికి దండగే

13 Sep, 2020 06:21 IST|Sakshi

సాగుని కార్పోరేటీకరణ చేస్తున్నారు

ఆర్డినెన్స్‌లను వెనక్కి తీసుకోవాలి

రేపట్నుంచి దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతున్న రైతులు  

న్యూఢిల్లీ : పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లో రైతన్నలు నిరసన బాట పట్టారు. 14 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో గిట్టుబాటు ధరలకి సంబంధించిన మూడు ఆర్డినెన్స్‌లకు చట్టరూపం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉండడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆర్డినెన్స్‌లతో వ్యవసాయ రంగాన్ని మోదీ సర్కార్‌ కార్పోరేటీకరణ చేస్తోందని మండిపడుతున్నారు. అవి చట్టరూపం దాలిస్తే తాము అప్పుల ఊబిలో కూరుకుపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమావేశాల మొదటి రోజైన సోమవారం దేశవ్యాప్తంగా ఆర్డినెన్స్‌లపై నిరసన గళాన్ని వినిపించాలని అఖిల భారత రైతు సమన్వయ కమిటీ జాతీయ కన్వీనర్‌ వీఎం సింగ్‌ పిలుపునిచ్చారు.  

ఏమిటీ ఆర్డినెన్స్‌లు?
కేంద్ర ప్రభుత్వం ఇటీవల వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరుతో నిత్యావసర సరుకుల(సవరణ) ఆర్డినెన్స్, రైతుల(సాధికారత, పరిరక్షణ) ధరల హామీ, సేవల ఒప్పంద ఆర్డినెన్స్, రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య(ప్రోత్సాహక, సులభతర) ఆర్డినెన్స్‌లను తీసుకువచ్చింది. ఈ ఆర్డినెన్స్‌లతో రైతులు పండించే పంటలకు ఎక్కువ ధర వస్తుందని, రైతులు తమ పంటల్ని దేశంలో ఎక్కడైనా, ఎప్పుడైనా అమ్ముకునే వీలు ఉంటుందని కేంద్రం చెబుతోంది. కాంట్రాక్ట్‌ వ్యవసాయం చట్టబద్ధమవుతుందని, రైతులే పారిశ్రామికవేత్తలుగా మారవచ్చునని అంటోంది. అయితే రైతులు వీటిని వ్యతిరేకిస్తున్నారు. కనీస మద్దతు ధర నిర్ణయించకుండా వ్యవసాయ రంగంలో సంస్కరణలు సాధ్యం కాదని వీఎం సింగ్‌ చెప్పారు. కాంట్రాక్ట్‌ వ్యవసాయానికి చట్టబద్ధత అన్నది మన దేశంలో చెరుకు రైతుల విషయంలో ఒక విఫల ప్రయోగంగా మిగిలిపోయిందని గుర్తు చేశారు. అసంఘటిత రంగంలో ఉండే రైతాంగానికి ఈ ఆర్డినెన్స్‌లు మేలు చేయవన్నారు.  

వ్యవసాయానికి మృత్యుఘంటికలు : కాంగ్రెస్‌
ఆర్డినెన్స్‌లపై పోరుబాట పట్టిన రైతన్నలకు కాంగ్రెస్‌ అండగా నిలిచింది. ఆ ఆర్డినెన్స్‌లు రైతు వ్యతిరేకమని ఆరోపించింది. కార్పోరేట్‌ రంగాన్ని మోదీ సర్కార్‌ పెంచి పోషిస్తోందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ çసూర్జేవాలా ధ్వజమెత్తారు.

మరిన్ని వార్తలు