వచ్చే పదేళ్లలో 50 శాతం మహిళా సీఎంలు

2 Dec, 2023 05:25 IST|Sakshi

సీఎంలయ్యే అర్హతలున్న మహిళా నేతలు మా పార్టిలో ఉన్నారు: రాహుల్‌

కొచ్చీ: కాంగ్రెస్‌ సంస్థాగత నిర్మాణంలో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, వారిని మరింత ప్రోత్సహించాలని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ పిలుపునిచ్చారు. పార్టిలో ఇంకా చాలామంది మహిళా నాయకులను తయారు చేయాలని, దేశంలో వచ్చే పదేళ్లలో 50 శాత మంది మహిళా ముఖ్యమంత్రులు ఉండాలన్నదే తమ కాంగ్రెస్‌ లక్ష్యమని స్పష్టం చేశారు. శుక్రవారం కేరళలోని కొచీ్చలో మహిళా కాంగ్రెస్‌ నేతల సదస్సు ‘ఉత్సాహ్‌’ను రాహుల్‌ గాంధీ ప్రారంభించారు.

ప్రస్తుతం కాంగ్రెస్‌ నుంచి మహిళా ముఖ్యమంత్రి ఎవరూ లేరని అన్నారు. ముఖ్యమంత్రులు కావడానికి అవసరమైన అన్ని అర్హతలు కలిగిన మహిళా నాయకులు కాంగ్రెస్‌లో ఎంతోమంది ఉన్నారని చెప్పారు. ప్రయతి్నంచాలి, లక్ష్యం సాధించాలి అని సూచించారు. ఈరోజు నుంచి వచ్చే పది సంవత్సరాల్లో దేశంలో 50 శాతం మంది ముఖ్యమంత్రులు మహిళలే ఉండాలని, అదే మన లక్ష్యమని          ఉద్ఘాటించారు.   

మహిళా బిల్లు అమల్లో జాప్యమెందుకు?
ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీపై రాహుల్‌ గాంధీ విరుచుకుపడ్డారు. అవి రెండూ పూర్తిగా పురుషాధిక్య సంస్థలని ఆరోపించారు. అధికారంలో మహిళలకు భాగస్వామ్యం కల్పించడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతం అంగీకరించదని చెప్పారు. మొత్తం ఆర్‌ఎస్‌ఎస్‌ చరిత్రను గమనిస్తే ఏనాడూ ఆ సంస్థలో మహిళల భాగస్వామ్యం లేదని గుర్తుచేశారు. మహిళలను ప్రోత్సహించే విషయంలో కాంగ్రెస్, ఆర్‌ఎస్‌ఎస్‌ మధ్య ఎంతో వ్యత్యాసం ఉందన్నారు.

మహిళా రిజర్వేషన్‌ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందినప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే అమలు చేయకపోవడం దారుణమని రాహుల్‌ మండిపడ్డారు. జాప్యం ఎందుకని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో ఆమోదం పొందాక దశాబ్దం తర్వాత అమలు చేసే బిల్లును తాను ఏప్పుడూ చూడలేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మహిళా బిల్లు విషయంలో మాత్రమే ఇలా జరుగుతోందని తప్పుపట్టారు. ఇదంతా బీజేపీ ప్రభుత్వ నిర్వాకమేనని ఆక్షేపించారు.  

మైక్రోఫోన్‌ను ప్రజల వైపు మళ్లిస్తున్నా..    
ఢిల్లీలో ఉండే కొందరు నాయకులు లౌడ్‌స్పీకర్లు, కెమెరాలను వారివైపే తిప్పుకుంటున్నారని రాహుల్‌ గాంధీ పరోక్షంగా బీజేపీ నాయకులపై ధ్వజమెత్తారు. తాను మాత్రం మైక్రోఫోన్‌ను ప్రజల వైపు మళ్లిస్తున్నానని చెప్పారు. సమస్యలను చెప్పుకొనే అవకాశం ప్రజలకు ఇస్తున్నానని తెలిపారు.

మరిన్ని వార్తలు