8% గృహాలకు వారంలో ఒక్క రోజే నీరు

3 Oct, 2022 04:51 IST|Sakshi

74% గృహాలకు వారమంతా సరఫరా

జల్‌శక్తి శాఖ అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 8% గృహాలకు వారంలో కేవలం ఒక్కరోజు నీరు సరఫరా అవుతుండగా, 74% మందికి వారమంతా అందుతున్నట్లు కేంద్రం జల్‌శక్తి శాఖ అధ్యయనంలో వెల్లడైంది. మరో 4% గృహాలకు వారంలో ఐదారు రోజులు, 14% మందికి కనీసం మూడు, నాలుగు రోజులు నీరు అందుతోందని ఆదివారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. మొత్తమ్మీద సరాసరిన రోజుకు మూడు గంటలు చొప్పున నీరు సరఫరా అవుతున్నట్లు వివరించింది.

తమ ఇళ్లలోని కుళాయిల ద్వారా అందే నీటితో రోజువారీ అవసరాల్లో 80% వరకు తీరుతున్నట్లు ప్రతి ఐదుగురిలో నలుగురు తెలిపినట్లు నివేదిక పేర్కొంది. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, యూపీల్లో కుళాయి కనెక్షన్లు లేని గృహాలు అత్యధికంగా ఉన్నట్లు తెలిపింది. కనీసం ఆరు రాష్ట్రాల్లోని 30%పైగా గృహాలకు గత వారం రోజులుగా కుళాయి నీరు కాలేదని వెల్లడైంది. ‘హర్‌ ఘర్‌ జల్‌’ పథకం అమలవుతున్న 91% గృహాల్లోని కుళాయిలు సర్వే చేపట్టిన రోజు పనిచేస్తున్నట్లు గుర్తించారు (జాతీయ స్థాయిలో ఇది 86%). 91% గృహాలకు 88% గృహాలకు అవసరాలకు సరిపోను (రోజుకు ప్రతి వ్యక్తికి 55 లీటర్లకు మించి) నీరు అందుతుండగా, 84% ఇళ్లకు రోజూ సరఫరా అవుతోంది. 90% గృహాలకు కుళాయిల ద్వారా మంచినీరు అందుతోంది.

మరిన్ని వార్తలు