అతనికి 90.. అమెకు 75.. పెళ్లితో ఒక్కటైన జంట

6 Sep, 2021 12:08 IST|Sakshi
ఫోటో కర్టసీ: నేషనల్‌ మీడియా

లక్నో: జీవితంలో తోడు అనేది తప్పనిసరి.. పుట్టి పెరిగేదాక తల్లిదండ్రులు, పెళ్లయ్యాక భర్త, భార్య తోడు, వృద్ధాప్యంలో పిల్లలు తోడు ఎంతో అవసరం. ఒకవేళ  అనుకోని కారణాలతో పెళ్లి తరువాత భర్త, భార్య చనిపోతే, వదిలేసి వెళ్లినా మరొకరిని వివాహం చేసుకుని తోడుగా ఉంటారు. తాజాగా 90 ఏళ్ల తాత, 75 ఏళ్ల బామ్మ పెళ్లి చేసుకొని జీవితంలో భాగస్వామి అవసరాన్ని తెలియజేశారు. అయితే వీరిద్దరికి ఇది రెండో వివాహం. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. జనపథ్ రామ్‌పూర్ పరిధిలోని నర్ఖేడీ నివాసి షఫీ అహ్మద్(90) భార్య చాలాకాలం క్రితమే మరణించింది. ఇతనికి అయిదుగురు కుమార్తెలు. చిరు వ్యాపారం చేస్తూ పిల్లలందరి పెళ్లిళ్లు చేసిన అహ్మద్‌ ప్రస్తుతం వయసు మీదపడటంతో ఇంట్లోనే ఉంటున్నాడు. 

కుమార్తెల‌కు పెళ్లిళ్లు కావ‌డంతో వారి వారంతా అత్త‌గారింటికి వెళ్లిపోయారు. అయితే తండ్రి ఒంటరివాడైపోవడంతో అతనికి కుమార్తెలు మళ్లీ వివాహం చేయాలనుకున్నారు. ఆలోచనతోనే ఆగిపోకుండా ఆచరణలోనూ ముందుండి నడిపించారు. 75 ఏళ్ల ఆయషా అనే వృద్ధురాలితో తండ్రికి వివాహం జరిపించి, తండ్రి ఒంటరితనాన్ని దూరం చేశారు. చివ‌రి ద‌శ‌లో త‌న తండ్రిని ఆమె జాగ్ర‌త్తగా చూసుకుంటుంద‌ని ఇలా చేసినట్లు కూతుళ్లు తెలిపారు. ఏది ఏమైనా వృద్ధాప్యంలో తోడు ఆవశ్యకతను తెలుపుతూ ఒక్కటైన ఈ జంట పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరికి సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 
చదవండి: ‘బుల్లెట్టు బండి’ పాట 22 రోజుల కష్టం: రచయిత లక్ష్మణ్‌
నాతో సెల్ఫీ అంటే మామూలు విషయం కాదు.. దిమ్మతిరిగిందా!

మరిన్ని వార్తలు