మనం ఏకంగా ఎద్దు నుంచి పాలు పితకగలిగాం!: ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌

19 Dec, 2022 15:13 IST|Sakshi
గోమాతకు పూజలు చేస్తున్న కేజ్రీవాల్‌ (పాత చిత్రం)

సాక్షి, న్యూఢిల్లీ: అత్యధిక స్థానాలు తమవేనంటూ గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రకటనలు ఇచ్చుకున్న ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌.. ఓటమి తర్వాత చల్లబడి పోయారు. ఈ క్రమంలో.. గుజరాత్‌ ఓటమిపై కేజ్రీవాల్‌ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ ఐదు సీట్లను గెల్చుకోవడం కూడా అతి కష్టమేనన్న రీతిలో ఆయన తాజా వ్యాఖ్యలు చేశారు. 

ఆదివారం ఢిల్లీలో జరిగిన నేషనల్‌ కౌన్సిల్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. ఆవు నుంచి పాలు ఎవరైనా పితుకుతారు. కానీ, ఎద్దు నుంచి పితకగలరా? గుజరాత్‌లో మనం గెలుపు కోసం చేసిన యత్నం దాదాపు అలాంటిదే అని వ్యాఖ్యానించారు. ఏడాది కాలంలోనే పంజాబ్‌లో అధికారం దక్కించుకున్నాం. ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను కైవసం చేసుకున్నాం. గోవాలో రెండు ఎమ్మెల్యే స్థానాలు, గుజరాత్‌లో ఐదు ఎమ్మెల్యే స్థానాలతో 14 శాతం ఓట్‌ షేర్‌ సాధించాం. గుజరాత్‌ పరిణామం ఓ వ్యక్తి మాట్లాడుతూ.. అది ఎద్దు నుంచి పాలు పితకడం లాంటిదని అన్నాడు.

అది అక్షరాల సత్యం. ఆవు నుంచి ఎవరైనా పాలు పితకగలరు. కానీ, మనం ఏకంగా ఎద్దు నుంచే పాలు పితికాం అని చెప్పారాయన. గుజరాత్‌లో ఈ దఫా కాకపోయినా.. 2027 అధికారం ఆప్‌దేనని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరతామని ప్రకటించారు కేజ్రీవాల్‌. ఇక గుజరాత్‌ ఎన్నికల ఓట్‌ షేర్‌తో.. ఆప్‌కు జాతీయ హోదా దక్కిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. జరిగిన కౌన్సిల్‌ సమావేశం ఆసక్తికరంగా సాగింది. అంతేకాదు.. ఈ భేటీ నుంచి చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని దేశ ప్రజలకు పిలుపు ఇచ్చారాయన. భారత జవాన్ల ప్రాణాలంటే మోదీ ప్రభుత్వానికి లెక్క లేకుండా పోయిందని విమర్శించారు.

మరిన్ని వార్తలు