వీడియో: కశ్మీర్‌లో బుల్లెట్‌ ప్రూఫ్‌ గ్లాస్‌ లేకుండా స్పీచ్‌.. ఆజాన్‌ సౌండ్‌ విని ఆగిన అమిత్‌ షా

6 Oct, 2022 11:21 IST|Sakshi
ముదాసిర్‌ షేక్‌ సమాధి వద్ద హోం మంత్రి అమిత్‌ షా

బారాముల్లా(జమ్ము కశ్మీర్‌): కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తన చేష్టలతో కశ్మీరీల జేజేలు అందుకున్నారు. బుధవారం సాయంత్రం ఉత్తర కశ్మీర్‌ బారాముల్లాలో నిర్వహించిన పబ్లిక్‌ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అయితే.. కాసేపటికే ఆయనకు ఏదో శబ్దం వినిపించింది. 

మసీదులో ఏమైనా జరుగుతుందా? అని ఆయన పక్కనున్న నేతలను అడిగి తెలుసుకున్నారు. సమీపంలోని మసీదు నుంచి అజాన్‌ అని వాళ్లు చెప్పగానే.. ఆయన తన ప్రసంగాన్ని ఆపేశారు. కాసేపటి తర్వాత అయిపోయిందా? అజాన్‌ అయిపోయింది ఇప్పుడు నేను ప్రసగించొచ్చా..? అంటూ అక్కడున్నవాళ్లను ప్రశ్నించారు. దీంతో అక్కడున్న వాళ్లంతా చప్పట్లు, ఈలలతో ఆయన్ని అభినందించారు.

అంతకు ముందు ర్యాలీలో ప్రసంగించే ముందు అమిత్ షా బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్‌ను తొలగించారు. తాను ప్రజలతో నేరుగా మాట్లాడాలనుకుంటున్నాను అంటూ ప్రసం​గిం‍చడం గమనార్హం. ఇక ర్యాలీ తర్వాత వురికి వెళ్లిన ఆయన.. అక్కడ మే నెలల జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన పోలీస్‌ అధికారి ముదాసిర్‌ షేక్‌ కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన సమాధికి నివాళులర్పించారు. కేంద్రం నుంచి ఆ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని మాటిచ్చారాయన.

ఇదిలా ఉంటే.. హోం మంత్రి అమిత్‌ షా మూడు రోజుల పర్యటన బుధవారంతో ముగిసింది. కశ్మీర్‌ భద్రతకు సంబంధించి ఉన్నతాధికారులతోనూ సమావేశం అయ్యారు ఆయన. ఇక ఈ పర్యటనలోనే ఉగ్రవాదాన్ని ప్రొత్సహించే పాక్‌తో ఎట్టిపరిస్థితుల్లో చర్యలు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు