ఢిల్లీ, ముంబైల చెంత బెంగళూరు.. ఎందులోనంటే?

26 Feb, 2021 15:50 IST|Sakshi

ఉద్యాన నగరిలో వాయు కాలుష్యం

తీవ్రంగా ప్రభావితమైన మూడో నగరంగా బెంగళూరు

బెంగళూరు: పార్కులు, చెట్లతో అడుగడుగునా పచ్చదనం పరుచుకున్న నగరం బెంగళూరు గార్డెన్‌ సిటీ పేరును సార్థకం చేసుకుంది. స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలనుకునే వారు ఈ ఉద్యాననగరికి వెళ్లాలనిపించేంతగా ఉండేది. కానీ, ప్రస్తుతం బెంగళూరు కాలుష్యం కోరల్లో విలవిల్లాడుతోంది. అక్కడి గాలి అంతటి స్వచ్ఛం కాదదన్న విషయం ప్రకృతి ప్రియుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. గాలి కాలుష్యంతో సతమతమవుతున్న మహానగరాలైన ఢిల్లీ, ముంబైల చెంత ఇప్పుడు బెంగళూరు చేరింది. 

మూడో నగరం.. 
బెంగళూరు మహానగరంలోని గాలి ఇప్పుడు కాలుష్యంతో నిండిపోయింది. గ్రీన్‌పీస్‌ సర్వే ప్రకారం, గార్డెన్‌ సిటీ ఆఫ్‌ ఇండియా బెంగళూరు వాయు కాలుష్యంలో దేశంలోనే మూడో స్థానంలో ఉంది. తొలి రెండు స్థానాల్లో ముంబై, ఢిల్లీ ఉన్నాయి. వాయు కాలుష్యం కారణంగా బెంగుళూరులో గత ఏడాది 1,200 మంది మృత్యువాత పడ్డారు. వాయు కాలుష్యంతో అత్యధికంగా ప్రభావితమైన ఢిల్లీలో 54,000 మంది మరణిస్తే, ముంబైలో 25,000 మంది మృత్యువాత పడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాలతో పోల్చిచూస్తే ఢిల్లీలో మరణాల సంఖ్య దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కేవలం ఐదు నగరాల్లోనే పీఎం. 2.5 వాయు కాలుష్యంతో సుమారు 1,60,000 మంది మరణించినట్టు నివేదిక పేర్కొంది. అయితే ప్రపంచ తీవ్ర వాయు కాలుష్య ప్రభావిత నగరాల ర్యాంకింగ్‌లో ఢిల్లీ ముందు వరుసలో ఉండడం ఆందోళన కలిగించే అంశం.
 

లాక్‌డౌన్‌తో కొంత మెరుగైనా.. అదే స్థితి 
కఠినమైన లాక్‌డౌన్‌ కారణంగా గాలి నాణ్యత ఈ ఏడాది కొంత మెరుగుపడినట్టు కనిపిస్తన్నప్పటికీ, వాయుకాలుష్యం ప్రజలెదుర్కొంటోన్న ప్రధానమైన సమస్య. ఎయిర్‌ పొల్యూషన్‌ ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. కాలుష్యరహిత వాతావరణం కోసం, పచ్చదనాన్ని పెంచేందుకు, కాలుష్య రహిత ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను అభివృద్ధి చేసుకునేందుకు సుస్థిర పరిష్కార మార్గాలను వెతకాల్సి ఉంది. అందుకు అవసరమైన పెట్టుబడులు పెట్టడం ప్రభుత్వాల ముందున్న తక్షణావసరం అని నిపుణులు భావిస్తున్నారు.

‘‘కలుషితమైన గాలి మనుషుల్లో కేన్సర్, గుండెపోటు అవకాశాలు పెంచుతుంది. ఊపిరితిత్తుల సమస్యను పెంచి, కోవిడ్‌ ప్రభావాన్ని తీవ్రతరం చేస్తుంది’’అని గ్రీన్‌పీస్‌ ఇండియా క్‌లైమేట్‌ క్యాంపెయినర్‌ అవినాష్‌ చంచల్‌ వ్యాఖ్యానించారు. ‘‘తక్కువ ఖర్చుతో కూడిన, కార్బన్‌ తటస్థ రవాణా వ్యవస్థను అనుసరించడం, వాకింగ్, సైక్లింగ్‌ని ప్రోత్సహించడం, ప్రజారవాణా వ్యవస్థని వాడుకోవడం కొంత మేరకు వాయు కాలుష్యనివారణకు ఉపయోగపడతాయి. అయితే వాకింగ్, సైక్లింగ్, ప్రజారవాణా వ్యవస్థని ఉపయోగించుకోవడం వల్ల కేవలం ప్రజారోగ్యం మెరుగుపడటమే కాకుండా ఇవి ప్రజాధనం ఆదాకు, ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చేందుకు ఇవి ఉపయోగపడతాయి’’అని చంచల్‌ చెప్పారు.  

బడిపిల్లలపై కాలుష్యం ప్రభావం 
పాఠశాల విద్యార్థులపై కాలుష్యం ప్రభావం తీవ్రంగా ఉన్నట్టు 2015లో ‘బ్రీత్‌ బ్లూ 15 సర్వే’ తేల్చింది. లంగ్‌ హెల్త్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ (ఎల్‌హెచ్‌ఎస్‌టీ) పరీక్షల్లో బెంగుళూరులో 14 శాతం మంది పాఠశాల విద్యార్థులు బ్యాడ్‌ క్యాటగిరీలో ఉన్నట్టు తేలింది. 8 నుంచి 12 ఏళ్ళ మధ్య వయస్సున్న 2,000 మంది విద్యార్థులను పరీక్షించి ఈ విషయాన్ని వెల్లడించారు.  

ముంబైలో     21 శాతం  
బెంగళూరులో    14 శాతం
కోల్‌కతాలో    13 శాతం   

మరిన్ని వార్తలు