235 మందితో రెండో విమానం రాక

15 Oct, 2023 06:02 IST|Sakshi

కొనసాగుతున్న ‘ఆపరేషన్‌ అజయ్‌’

న్యూఢిల్లీ: సంక్షుభిత ఇజ్రాయెల్‌ నుంచి భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. ‘ఆపరేషన్‌ అజయ్‌’ పేరిట భారత సర్కార్‌ మొదలుపెట్టిన పౌరుల తరలింపు కార్యక్రమంలో భాగంగా శనివారం 235 మందితో ఇజ్రాయెల్‌ నుంచి బయల్దేరిన విమానం భారత్‌కు చేరుకుంది. ఢిల్లీకి ఈ విమానం చేరుకుందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్‌ బాగ్చీ శనివారం వెల్లడించారు. ఢిల్లీ విమానాశ్రయంలో పౌరులు చేరుకున్న ఫొటోలను సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో షేర్‌ చేశారు.

టెల్‌ అవీవ్‌ నగరం నుంచి తొలి విమానం వచి్చన సంగతి తెల్సిందే. ఎయిర్‌ఇండియా ఆధ్వర్యంలో జరిగిన ఆ ఆపరేషన్‌ కింద తొలి విమానంలో 200కుపైగా భారతీయులు స్వదేశానికి రాగలిగారు. వీరికి విదేశాంగ శాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్‌ రంజన్‌ సింగ్‌ స్వాగతం పలికారు. ‘ మోదీ సర్కార్‌ తక్షణం స్పందించి తమ పౌరులను స్వదేశానికి తీసుకురావడం పట్ల వీరంతా సంతోషంగా ఉన్నారు’ అని మంత్రి ట్వీట్‌చేశారు. దీంతో శనివారంనాటికి మొత్తంగా 400కుపైగా భారత్‌కు చేరుకున్నారు.  

మరో రెండు విమానాలూ వస్తున్నాయ్‌
టెల్‌ అవీవ్‌ స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం ఐదింటికి, రాత్రి 11 గంటలకు మరో రెండు ప్రత్యేక విమానాలు భారత్‌కు బయల్దేరతాయని టెల్‌ అవీవ్‌లోని ఇండియన్‌ ఎంబసీ తెలిపింది. సాయంత్రం విమానంలో 230కిపైగా, రాత్రి విమానంలో 330కిపైగా ప్రయాణికులు స్వదేశానికి రానున్నారు. బెన్‌ గురియన్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఇవి బయల్దేరతాయి. సంబంధిత వివరాలను ఎంబసీ ట్వీట్‌చేసింది. విద్యార్థులు, ఐటీ వృత్తినిపుణులు, వజ్రాల వ్యాపారులు సహా పలు రంగాలకు చెందిన దాదాపు 18,000 మంది భారతీయపౌరులు ఇజ్రాయెల్‌లో ఉంటున్న విషయం తెల్సిందే.  

తీసుకొచ్చేందుకు వెళ్తున్నాయ్‌
భారత్‌ నుంచి చెరో విమానాన్ని ఇజ్రాయెల్‌కు నడపనున్నట్లు ఎయిర్‌ఇండియా, స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థలు శనివారం ప్రకటించాయి. టెల్‌అవీవ్‌కు వెళ్లి అక్కడి భారతీయులను తీసుకొస్తామని సంస్థలు పేర్కొన్నాయి. ఆపరేషన్‌ అజయ్‌లో భాగంగా ఈ రెండు సరీ్వస్‌లు నడవనున్నాయి. ఢిల్లీ నుంచి ఎయిర్‌ఇండియా విమానం, అమృత్‌సర్‌ నుంచి స్పైస్‌జెట్‌ విమానం బయల్దేరతాయి. ఆదివారంకల్లా రెండూ ఢిల్లీకి వస్తాయి.

మరిన్ని వార్తలు