రోడ్డుపై నిలిచిపోయిన బస్సు.. కారు దిగొచ్చి వెనక్కి నెట్టిన కేంద్ర మంత్రి

9 Nov, 2022 08:46 IST|Sakshi

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో కేంద్ర మంత్రి అనురాగ్‌  ఠాకూర్‌ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బిలాస్‌పూర్‌ నియోజకవర్గం పరిధిలో ఆయన పర్యటిస్తుండగా.. ఆసక్తికర సంఘటన జరిగింది. నడి రోడ్డుపై బస్సు బ్రేక్‌డౌన్‌ అయ్యింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కేంద్ర మంత్రి ఠాకూర్‌ కాన్వాయ్ సైతం‌ నిలిచిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. విషయం తెలుసుకున్న ఆయన కారు దిగి అక్కడున్న వారితో కలిసి బస్సును వెనక్కి తోశారు. అనంతరం బస్సు డ్రైవర్‌, ప్రయాణికులతో కాసేపు మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ట్రాఫిక్‌ సర్దుకున్నాక అక్కడి నుంచి ప్రచారానికి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

అంతకుముందు బిలాస్‌పూర్‌ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఠాకూర్‌. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మరోసారి భాజపా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని గ్రామాల్లో రోడ్లను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని పర్యటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. ‘ప్రాజెక్ట్‌ శక్తి’ పేరిట వచ్చే 10 ఏళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేస్తామని అన్నారు.

ఇదీ చదవండి: షాకింగ్‌ రిపోర్ట్‌: కరోనాను మించిన వైరస్ తయారీలో పాక్‌-చైనా!

మరిన్ని వార్తలు