Madhya Pradesh: ఇప్పుడా ద్రోహి లేడు.. దిగ్విజయ్‌ తీవ్ర వ్యాఖ్యలు

2 Dec, 2023 22:11 IST|Sakshi

భోపాల్: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ఉద్దేశించి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో శనివారం ఆయన రాష్ట్ర రాజధాని భోపాల్‌లో మీడియాతో మాట్లాడారు.

ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి అడిగిన ప్రశ్నకు ద్విగ్విజయ్ సింగ్‌ స్పందిస్తూ ‘మేం పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మా దగ్గర సింధియా లేడు. కాబట్టి ద్రోహి లేడు’ అన్నారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మధ్యప్రదేశ్‌లోని దాతియాలో ఇటీవల జరిగిన బహిరంగ ర్యాలీలో మాట్లాడుతూ సింధియాపై 'ద్రోహి' అంటూ విరుచుకుపడ్డారు.

సింధియా తనతో ఎమ్మెల్యేలతో కలిసి 2020 మార్చిలో కాంగ్రెస్‌ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది. ఇప్పుడా పరిస్థితి లేదని, కాంగ్రెస్ పార్టీ 130 సీట్లకుపైగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు కాంగ్రెస్ నేత, దిగ్విజయ్ సింగ్ కుమారుడు జైవర్ధన్ సింగ్ కూడా తమకు స్పష్టమైన మెజారిటీ వస్తుందని చెప్పారు.

మరిన్ని వార్తలు