వెనక్కి వెళుతున్న విమానంలా ఉంది

5 May, 2022 16:49 IST|Sakshi

దేశ ప్రస్తుత పరిస్థితిపై అరుంధతీ రాయ్ వ్యాఖ్య

ఢిల్లీలో జిఎన్‌ సాయిబాబా పుస్తకావిష్కరణ

సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా హాజరు

న్యూఢిల్లీ: మన దేశంలో ప్రస్తుత పరిస్థితి అపసవ్య దిశలో కదులుతున్న విమానంలా ఉందని.. అది ఎప్పుడైనా ప్రమాదానికి దారి తీయొచ్చని ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ పేర్కొన్నారు. జైలు శిక్ష అనుభవిస్తున్న మానవ హక్కుల కార్యకర్త ప్రొఫెసర్‌ జిఎన్ సాయిబాబా కవితలు, లేఖలతో సంకలనం చేసిన ‘వై డూ యూ ఫియర్ మై వే సో మచ్’ పుస్తకావిష్కరణ సభలో బుధవారం ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 1960వ దశకంలో సంపద, భూమి పునఃపంపిణీ కోసం నిజంగా విప్లవాత్మక ఉద్యమాలు జరిగాయని.. ప్రస్తుత నాయకులు ఉచిత పథకాలతో ఓట్లకు గాలం వేస్తున్నారని వ్యాఖ్యానించారు.  ‘ఇటీవల, నేను నా పైలట్ స్నేహితుడిని అడిగాను. 'మీరు ఒక విమానాన్ని వెనుకకు నడిపించగలరా?' అని. దానికి అతడు పెద్దగా నవ్వాడు. మన దేశంలో సరిగ్గా ఇప్పుడు ఇదే జరుగుతోందని నేను చెప్పా. మన నాయకులు విమానాన్ని రివర్స్‌లో ఎగురవేస్తున్నారు. ప్రతిదీ పడిపోతోంది. పతనం దిశగా పయనిస్తున్నామ’ని అరుంధతీ రాయ్ అన్నారు. 

ఎంత అవమానకరం?
మన దేశంలో చట్టాలు ఉన్నప్పటికీ కులం, వర్గం, లింగం, జాతి ఆధారంగా వేర్వేరుగా వర్తించబడతాయని పేర్కొన్నారు. ‘ఈ రోజు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? 90 శాతం పక్షవాతం వచ్చి ఏడేళ్లుగా జైల్లో ఉన్న ఓ ప్రొఫెసర్ గురించి మాట్లాడేందుకు కలిశాం. ఇక మనం మాట్లాడాల్సిన పనిలేదు. మనం ఎలాంటి దేశంలో జీవిస్తున్నామో చెప్పడానికి ఇది చాలు.. ఇది ఎంత అవమానకరం’ అని అరుంధతీ రాయ్ అన్నారు.

90 శాతానికి పైగా శారీరక వైకల్యాలు కలిగి, వీల్‌చైర్‌ను ఉపయోగించే జిఎన్ సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని, దేశంపై యుద్ధం చేస్తున్నారనే ఆరోపణలపై మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని సెషన్స్ కోర్టు 2017లో జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం ఆయన నాగపూర్‌ సెంట్రల్‌ జైలులో ఉన్నారు. (చదవండి: జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన పూర్తి)

సాయిబాబాను విడుదల చేయాలి: రాజా
పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా మాట్లాడుతూ.. జిఎన్ సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పిన వారిపై దేశద్రోహులు, అర్బన్‌ నక్సలైట్స్‌, అర్బన్‌ మావోయిస్టులుగా ముద్ర వేసి జైల్లో పెడుతున్నారని ఆరోపించారు. 

శారీరక వైకల్యానికి తోడు అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న తన భర్త పట్ల జైలులో అవమానవీయంగా ప్రవరిస్తున్నారని జీఎన్ సాయిబాబా సతీమణి వసంత ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి అంత్యక్రియలకు వెళ్లేందుకు కూడా ఆయనను అనుమతించలేదని వాపోయారు. (చదవండి: పత్రికా స్వేచ్ఛ.. నానాటికీ తీసికట్టు)

మరిన్ని వార్తలు